Telugu Gateway
Andhra Pradesh

అమరావతికి అనుకూలంగా బిజెపి కోర్ కమిటీ తీర్మానం

అమరావతికి అనుకూలంగా బిజెపి కోర్ కమిటీ తీర్మానం
X

కన్నా లైన్ లోకే జీవీఎల్!

అమరావతి విషయంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లైన్ లోకే బిజెపి ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు కూడా వచ్చారు. ఇటీవల వరకూ ఆయన రాజధానిపై తుది నిర్ణయం రాష్ట్ర సర్కారుదే అని..కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోదంటూ ప్రకటించారు. అయితే శనివారం నాడు విజయవాడలో సుదీర్ఘంగా జరిగిన ఏపీ బిజెపి కోర్ కమిటీ సమావేశంలో అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను గత ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా అమరావతిపై నిర్ణయం తీసుకున్నా ఆ రోజు అందరూ దీనికి ఆమోదం తెలిపారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. టీడీపీ,బిజెపి, వైసీపీతోపాటు అన్ని పార్టీలు అమరావతికి ఆ రోజు మద్దతు ఇచ్చాయని తెలిపారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని చంకలో పెట్టుకుని పోతానంటే అది సాధ్యంకాదన్నారు. దీని వల్ల ఏపీ ప్రతిష్ట దెబ్బతింటుందని ..రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రావన్నారు. సీడ్ క్యాపిటల్ ఒకే చోట ఉండాలనేది బిజెపి విధాన నిర్ణయం అని..తాము దీనికే కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.

పరిపాలన వికేంద్రీకరణ పేరుతో రాజధానిని తరలించటం సరికాదన్నారు. రాజధానికి నిధుల మంజూరు కేంద్రంతో ముడిపడి ఉన్న వ్యవహారం అయినందున ఆ అంశం వారి దగ్గరకు వెళ్ళినప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని.పార్టీపరంగా తాము అందరం కలిసే తీర్మానం చేసినట్లు స్పష్టం చేశారు. కన్నా తర్వాత జీవీఎల్ కూడా మీడియాతో మాట్లాడుతూ పార్టీ అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందున ఇదే తమ విధానం అని స్పష్టం చేశారు. కోర్ కమిటీ చేసింది రాజకీయ తీర్మానం అని..దీంతో కేంద్రానికి సంబంధం లేదని తెలిపారు. కేంద్రం తన వైఖరి చెప్పాల్సి వస్తే అప్పుడు స్పందిస్తుందని తెలిపారు. అమరావతికి అనుకూలంగా బిజెపి నేరుగా పోరాటం చేయాలని నిర్ణయించింది. సంక్రాంతి తర్వాత తాము పోరాటం చేస్తామని కన్నా వెల్లడించారు.

Next Story
Share it