Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

మూడు రాజధానుల బిల్లుకు అసెంబ్లీ ఓకే

0

సోమవారం ఉదయం సరిగ్గా పదకొండు గంటలకు ఏపీ అసెంబ్లీ  ప్రారంభం అయింది. తిరిగి అదే రోజు రాత్రి పదకొండు గంటలకు పూర్తయింది. పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్థిలో అందరిని సమ్మిళితం చేసే బిల్లుకు అసెంబ్లీ ఓకే చెప్పింది. దీంతోపాటు ఏపీసీఆర్ డీఏ రద్దు బిల్లును కూడా అసెంబ్లీ ఆమోదించింది. అంతకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు. తనకు అమరావతిపై ఎలాంటి వ్యతిరేకతలేదని..ఉంటే ఇక్కడ శాసన రాజదానిని ఎందుకు ఉంచుతామని ప్రకటించారు. అమరావతి రాబోయే  రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని ప్రకటించారు. టీడీపీ నేతలు..కొన్ని మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని జగన్ ధ్వజమెత్తారు. అన్ని కులాల వారు కలసి ఓట్లు వేస్తేనే నాకు 151 సీట్ల వచ్చాయి. జగన్ కమ్మ వారికి వ్యతిరేకం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు అలాంటిది ఏమీ లేదు. నాకు అన్ని కులాలు సమానమే. నాకు ఎంతో  నమ్మకమైన మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని. నా పర్యటనలు చూసే తలశిల రఘురాం ఎవరు?. వీళ్లు కమ్మవారేకదా? మరి వాళ్లు నాతో ఎలా ఉన్నారు. అన్ని కులాలు..అన్ని మతాలు బాగుండాలి. ఇదే నా విధానం. అమరావతిపై కోపం ఉంటే ఇక్కడ శాసన రాజధానిని ఎందుకు ఉంచుతా? అని జగన్ ప్రశ్నించారు.

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తున్నా. కర్నూలు  అన్యాయం అయిన ప్రాంతం. శ్రీభాగ్ ఒప్పందం అమలు జరగలేదు కానీ..దేవుడు నా హయాంలో మేలు చేసే అవకాశం ఇచ్చినందున సంతోషపడుతూ న్యాయ రాజదానిగా చేస్తున్నా.దీనికి మద్దతు పలకాలని ప్రతి కుటుంబాన్ని కోరుకుంటున్నా?. అమరావతి  ప్రాంతానికి అన్యాయం చేయటం లేదు. మిగిలిన ప్రాంతాలకూ న్యాయం చేస్తున్నా. అంతే. ఏపీ చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన రోజు, గత ప్రభుత్వం ఎన్నో తప్పిదాలు చేసింది.  రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు తన హయాంలో రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చేశారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలు అభివృద్ధి వికేంద్రీకరణకే ఓటు వేశాయి. రాజధాని విషయంలో చంద్రబాబు ఎలాంటి పనులు చేయకుండా సినిమాలు చూపించారు.  రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది ముమ్మాటానికి నిజం.

- Advertisement -

అమరావతి అంటూ చంద్రబాబు భ్రమరావతిని క్రియేట్ చేశారని వ్యంగాస్త్రాలు సంధించారు జగన్ . మీడియాకు లీకులు ఇచ్చి..వార్తలు రాయించి నూజీవీడులో భూములు కొనకుండా..నాగార్జున యూనివర్శిటీ దగ్గర భూములు కొనకుండా కేవలం అమరావతి ప్రాంతంలోనే కొన్నారంటే ఏమి జరిగిందో ప్రజలకు అర్ధం కాదా? అని జగన్ ప్రశ్నించారు. రాజధానిలో ప్రస్తుతం 5020 ఎకరాలు మాత్రమే మిగులుతుంది. గ్రీన్ ట్రిబ్యునల్ తోపాటు..రివర్ కన్జర్వేషన్ యాక్ట్ వంటివి చాలా అవరోధాలు ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ అంశంపై కూడా చిత్తశుద్ధితో ఆలోచించాం. కానీ ఎకరా 20 కోట్లకు అమ్మితేనే వర్కవుట్ అవుతుంది. అది ఇప్పుడు సాధ్యం అయ్యే పనేనా? అని జగన్ ప్రశ్నించారు.

టీడీపీ నేతలకు రైతులపై ప్రేమలేదని జగన్ వ్యాఖ్యానించారు.  చంద్రబాబు వల్లే 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్‌ను పోగొట్టుకున్నామని గుర్తు చేశారు. వికేంద్రీకరణ బిల్లుపై శాసనసభలో సోమవారం రాత్రి  సీఎం జగన్‌ అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్‌1న కర్నూలు రాజధానిగా అవతరించిన నాటి నుంచి 2014 జూన్‌లో 13 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించేంత వరకు… ఆతర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే… రకరకాల పొరపాట్లు చోటు చేసుకున్నాయి. 1953లో ఆంధ్ర రాష్ట్రంగా అవతరిస్తూ మద్రాసును పోగొట్టుకున్నాం. ఆ తర్వాత కర్నూలును త్యాగం చేశాం. ఆ తర్వాత హైదరాబాద్‌ను పోగొట్టుకున్నాం. ఒక అభివృద్ధి కేంద్రంగా, ఉద్యోగాల కేంద్రంగా ఉన్న నగరాలను పోగొట్టుకున్న ఏకైక రాష్ట్రం మనదే. చివరకు 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్‌ను ఓటుకు కోట్లు ఇస్తూ పట్టుబడిన ఓ పెద్ద మనిషి వల్ల పోగొట్టుకున్నాం’  అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

1997లో శ్రీబాగ్‌ ఒప్పదం జరిగింది. గతంలో 1937లో అప్పట్లో మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉండగా.. తెలుగువారంతా ఒకటి కావాలి అని ఆరోజు శ్రీబాగ్‌ ఒప్పందం చేసుకున్నారు. 2014లో రాష్ట్ర విభజన చేయడానికి ముందు జస్టిస్‌ శ్రీకృష్ట కమిటీ 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో అనేక అంశాలపై అధ్యయనం చేసింది. ప్రాంతీయ అసమానతలు, ఉద్యోగాల పరంగా అసమానతలు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయో ఆ నివేదిక వెల్లడించింది. మొదటి తెలంగాణ ఉద్యమం అభివృది రాహిత్యం వల్ల వస్తే.. రెండవ సారి అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల వచ్చిందని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల ఏ రకమైన నష్టం జరుగుతుంతో శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు పేర్కొంది. ఆ తర్వాత శివరామకృష్ణ కమిటీ కూడా ఇదే చెప్పింది. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి అంతా కూడా ఒక్క ప్రాంతానికే పరిమితం చేయడానికి వీల్లేదని ఈ కమిటీ చెప్పింది. దీనిని చంద్రబాబు వక్రీకరించి చెప్పారు. సూపర్‌ క్యాపిటల్‌ వద్దే వద్దని కమిటీ చెప్పింది. మూడు ప్రాంతాల్లో పాలన వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణ కమిటీ సూచించింది. శివరాకృష్ణ తాను రాసిన వ్యాసాల్లో కూడా చంద్రబాబు తీరును తప్పుబట్టారు. చంద్రబాబు తీరు ఏపీకి ఆత్మహత్యా సదృశంగా మారిందని సీఎం జగన్ ఆరోపించారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.