ప్రహసనంగా అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ఓట్ల లెక్కింపు
ముందు 121 ఓట్లు..తర్వాత 133కు పెరిగిన సంఖ్య
గేట్లు వేసి లెక్కించినా..12 ఓట్లు పెరుగుదల ఎలా?
వ్యతిరేకంగా నిల్..సభకు దూరంగా ఉన్న టీడీపీ
అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం భారీ మెజారిటీతో నెగ్గింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 133 ఓట్లు వచ్చాయని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. తొలుత స్పీకర్ మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా 121 ఓట్లు వచ్చినట్లు సభలో ప్రకటించారు. అయితే అధికారపక్షం నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావటంతో మళ్లీ లెక్కింపు ప్రారంభించారు. రెండవ సారి లెక్కింపు తర్వాత ఈ సంఖ్య 133 ఓట్లకు పెరిగింది. గేట్లు వేసి మరీ జరిపిన లెక్కింపులో కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లో 12 ఓట్లు ఎలా పెరిగాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష టీడీపీ సభకు దూరంగా ఉండటంతో ఒక్క ఓటు కూడా వ్యతిరేకంగా పడలేదు. జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్ కూడా మండలి రద్దుకు మద్దతు ప్రకటించారు. ఆర్టికల్ 169 ప్రకారం రద్దుపై నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఏపీ అసెంబ్లీలో సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో మండలి రద్దుకు సంబంధించిన తీర్మానంపై ఓటింగ్ జరిగింది. సభ్యులు అందరినీ నిల్చుని ఉండమని కోరిన స్పీకర్ తమ్మినేని సీతారాం తర్వాత సిబ్బందితో లెక్కింపు పూర్తి చేశారు. అంతకు ముందు సభలో ఈ తీర్మానంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబునాయుడు గతంలో మండలి గురించి మాట్లాడిన మాటలతోపాటు..ప్రత్యేక హోదా, ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ పార్టీ విషయంలో చంద్రబాబు ఎన్ని మాటలు మార్చారో చూడండి అంటూ సభలో వీడియోలను ప్రదర్శించి చూపారు.
కేవలం మూడు రోజులు గడువు ఇచ్చి మండలి రద్దుపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించినా ఎల్లో మీడియా ఇస్టానుసారం వార్తలు రాసిందని..ఐదు కోట్లకు ఎమ్మెల్సీలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించామని దుర్మార్గపు రాతలు రాశారని జగన్ మండిపడ్డారు. అదే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటే జగన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడని, ఎవరితో చర్చించరని అనేవారని..ఎమ్మెల్యేలతోపాటు రాష్ట్ర ప్రజల్లో కూడా చర్చ జరగాలనే ఉద్దేశంతోనే తాను సభలోనే మండలి రద్దుపై నిర్ణయం తీసుకుందామని ప్రకటిస్తే టీడీపీ, ఎల్లో మీడియా కలసి దుష్ప్రచారం చేపట్టాయని విమర్శించారు. మండలికి ఏటా 60 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మండలి ఉందని జగన్ తెలిపారు.
పేదలకు మంచి జరిగే బిల్లులను అడ్డుకోవటమే పనిగా ప్రతిపక్షాలు ఉన్నాయని అన్నారు. ప్రజలకు అత్యంత వేగంగా మంచి చేయాలని చూస్తుంటే..మండలిలో అడ్డుపడుతున్నారని జగన్ విమర్శించారు. మండలి రద్దు అధికారం అసెంబ్లీకే ఉందని అన్నారు. శాననసభలోనే మేథావులు ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేసే నిర్ణయాల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సభలో ఉన్న జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్ కూడా మండలి రద్దుకు అనుకూలంగా నిలుచుని ఓటింగ్ లో పాల్గొన్నారు. అత్యంత కీలకమైన మండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ విషయంలో అసెంబ్లీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారా? లేక మరేదేనా కారణం ఉందా?. అసెంబ్లీ వంటి చోట్ల ఓటింగ్ అత్యంత కీలకమైన వ్యవహారం. కొన్ని సందర్భాల్లో ఓట్లలో తేడా వస్తే ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి ఉంటుంది?. మరి అలాంటి సభలో ఓటింగ్ లో పాల్గొన్న వారిని లెక్కింపు విషయంలో ఇంత గందరగోళం నెలకొనటం ఎలాంటి సంకేతాలు పంపుతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది.