విశాఖ ‘టీడీపీ’లో కలకలం..అర్భన్ అధ్యక్షుడు రెహ్మన్ రాజీనామా
మూడు రాజధానుల అంశం ఏపీ టీడీపీలో పెద్ద దుమారమే రేపుతోంది. ఇఫ్పటికే పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు ప్రకటించగా..సమావేశం పెట్టి మరీ తీర్మానం చేయటం పార్టీలో కలకలం రేపింది. మాజీ మంత్రి, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు మొదటి నుంచి విశాఖపట్నానికి అనుకూలంగా మాట్లాడుతూ చంద్రబాబుకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు ఉద్యమం చేయించడాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి సీనియర్ నేత రెహమాన్ రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం అర్బన్ ప్రాంత టిడిపి అధ్యక్షుడుగా ఉన్నారు.
గతంలో 1994 లో టిడిపి పక్షాన విశాఖ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొద్ది రోజుల క్రితం టిడిపి నేతల సమావేశంలో ఆయన పాల్గొని విశాఖ రాజదాని అంశాన్ని స్వాగతించారు. తాను విశాఖ రాజధానికి సమర్దించకపోతే చరిత్రహీనుడను అవుతానని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు విశాఖ ప్రజలకు , అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఐదేళ్లు అధికారం ఇచ్చి అవకాశం ఇస్తే చంద్రబాబు రాజధాని నిర్మించలేకపోయారని రెహమాన్ వ్యాఖ్యానించారు.పార్టీకి, పదవికి రెహమాన్ రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రాజకీయాల్లోకి ప్రవేశించాక.. తాము చంద్రబాబుకు దూరమయ్యామని తెలిపారు. గురువారం రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నార్సీ బిల్లు వల్ల కొంతమంది భారతీయుల్లో అభద్రతాభావం ఏర్పడిందన్నారు. ఎన్నార్సీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం తమకు సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఏపీలో ఎన్నార్సీ అమలు చేయటం లేదని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్‌కు తమ మైనార్టీలంతా రుణపడి ఉన్నామన్నారు. ఎన్నార్సీని వ్యతిరేకించిన సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేయాలంటూ చంద్రబాబు తమకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. తమ కోసం అనుకూల నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్ ప్రకటనను తాము ఎలా వ్యతిరేకిస్తామని ప్రశ్నించారు. ఎన్నార్సీ బిల్లుపై చంద్రబాబు తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ రాజధాని కావాలని తాము గతంలోనే కోరామని.. అందుకోసం తను పోరాటం కూడా చేశానని చెప్పారు. అమరావతి రైతులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని.. తప్పుడు రాజకీయాలు చేయవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. గత ఐదేళ్ల చంద్రబాబు విధానాల వల్ల పార్టీ కార్యకర్తలు సంతోషంగా లేరని.. కొంత మంది నాయకులు మాత్రమే బాగుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.