Telugu Gateway
Telangana

ఎన్ కౌంటర్ పై సజ్జనార్

ఎన్ కౌంటర్ పై సజ్జనార్
X

శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఒకటే చర్చ. ఎన్ కౌంటర్. అది కూడా సంచలనం సృష్టించిన దిశ రేప్..హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్. అంతే ఒక్కసారిగా రాష్ట్రంతోపాటు దేశంలోని మీడియా అంతా అలర్ట్. ఏమి జరిగిందో తెలుసుకునే ప్రయత్నం. అయితే ఈ ఎన్ కౌంటర్ ద్వారా దేశ ప్రజలు ఏమి కోరుకున్నారో అదే జరిగింది. దిశ కుటుంబానికి కూడా సత్వర న్యాయం జరిగినట్లు అయింది. అయితే దీనిపై కూడా భిన్న వాదనలు. మరి అందరికీ ఇదే న్యాయం వర్తింపచేస్తారా? అంటూ ప్రశ్నలు. శిక్ష ఏదైనా నిర్దేశించుకున్న చట్టం ప్రకారం ఉండాలి కదా? అన్న వాదన. ఈ చర్చలు ఓ వైపు సాగుతుండగా..సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అసలు ఎన్ కౌంటర్ ఎలా జరిగింది అనే విషయాలను మీడియాకు వివరించారు. అందులోని ముఖ్యాంశాలు...‘దిశ కేసులో నిందితులు పోలీసులపైకి కాల్పులు జరపడంతోనే ఎదురుదాడి చేయాల్సి వచ్చింది. తొలుత నిందితులు రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడికి యత్నించారు.

ఆ తర్వాత రెండు తుపాకులు లాక్కున్నారు. దీంతో పోలీసులు ఫైరింగ్‌ ఓపెన్‌ చేయాల్సి వచ్చింది. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు.’ అని తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున చటాన్‌పల్లిలో దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. గత నెల 27 అర్ధరాత్రి దిశపై అత్యాచారం, హత్య జరిగింది. ఆ తర్వాత చటాన్‌పల్లి వద్ద దిశను తగులబెట్టారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశాం. అలాగే శాస్త్రీయ ఆధారాలు కూడా సేకరించాం. అరెస్ట్‌ చేసిన నలుగురిని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచాం. నిందితులను ఈ నెల 2న కోర్డు పదిరోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. దీంతో 4న చర్లపల్లి జైలు నుంచి కస్టడీలో తీసుకోని విచారించాం. చటాన్‌పల్లిలో బాధితురాలి సెల్‌ఫోన్‌, ఇతర వస్తువులు దాచిపెట్టామని నిందితులు విచారణలో వెల్లడించారు.

దీంతో ఆ వస్తువులను రికవరీ చేసేందుకు నిందితులను ఈ రోజు తెల్లవారుజామున చటాన్‌పల్లికి తీసుకొచ్చాం. వారిచ్చిన సమాచారం మేరకు దిశ సెల్‌ఫోన్‌, వాచ్‌, పవర్‌బ్యాంక్‌లను సేకరించాం. అయితే నిందితులు ఇక్కడికి వచ్చిన తరువాత పోలీసులపై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. అలాగే పోలీసులకు చెందిన రెండు తుపాకులను లాక్కుని కాల్పులు జరిపారు. పోలీసులు హెచ్చరించినా కూడా నిందితులు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు కూడా కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు చనిపోయారు. నిందితులు ఆరిఫ్‌, చెన్నకేశవుల దగ్గర గన్స్‌ స్వాధీనం చేసుకున్నాం. నిందితులు చేసిన రాళ్ల దాడిలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్‌కు కూడా గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. ఈ రోజు ఉదయం 5.45 నుంచి 6.15 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురు గతంలో చాలా నేరాలు చేశారనే అనుమానాలు ఉన్నాయి. కర్ణాటక, ఏపీలో మిస్సింగ్‌ కేసులను పరిశీలించాలి​. దీనిపై లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంద’ని చెప్పారు. దిశ కుటుంబ సభ్యుల ప్రైవసీకి ఇబ్బంది కలిగించవద్దని కోరారు.

Next Story
Share it