Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో అవినీతి అధికారిని రక్షించిన తెలంగాణ మంత్రి!

ఏపీలో అవినీతి అధికారిని రక్షించిన తెలంగాణ మంత్రి!
X

ఆయన ఏపీ ప్రభుత్వంలో కీలక అధికారి. అత్యంత కీలకమైన శాఖలో సంవత్సరాల పాటు పని చేశారు. అందినంత దండుకున్నారు. గత ప్రభుత్వంలోని పెద్దల అండతో ఇష్టానుసారం దోపిడీ చేశారు. దీనిపై అప్పట్లోనే ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ సదరు అధికారి ఓ కీలక మంత్రికి బంధువు కావటంతో సర్కారు కూడా ఏమీ చేయకుండా మౌనం దాల్చింది. కానీ ఏపీలో కొత్త సర్కారు వెలుగులోకి వచ్చాక ఆయన అక్రమాలు అన్నీ వెలుగులోకి వచ్చాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఓ కంపెనీ విషయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేసిన విచారణలో సదరు అధికారి కారణంగా సర్కారు ఖజానాకు 18 కోట్ల రూపాయల మేర నష్టం చేకూర్చారని నివేదిక ఇచ్చింది. ఈ అక్రమాల జాబితాలో ఆయనతోపాటు ఓ కీలక అధికారిణి కూడా ఉన్నారు. ఈ ఒక్క కేసులోనే ఇంత మొత్తం ఉంది. ఆయన అక్రమాలు అన్నింటిపై విచారణ చేస్తే ఆ మొత్తం కళ్ళు తిరిగే రేంజ్ లో ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నా సరే ఏపీ సర్కారు ఆయన విషయంలో గత ప్రభుత్వం వహించినట్లే ఉదాసీనంగా వ్యవహరించింది. దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయి.

ఓ వైపు అవినీతిని సహించేదిలేదంటూ మరో వైపు సిఫారసులకు తలొగ్గుతున్నారు. తెలంగాణ కు చెందిన ఓ కీలక మంత్రి రంగంలోకి దిగి ఏపీలో మాజీ మంత్రికి అత్యంత సమీప బంధువు అయిన ఆ అధికారిని రక్షించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఇదే కారణంతో సర్కారు ఆయన్ను వదిలేసిందని చెబుతున్నారు. ఆ మాజీ మంత్రికి..ఈ మంత్రికి మధ్య కూడా బంధుత్వం ఉంది. దీంతో తెలంగాణ మంత్రి సీరియస్ గా రంగంలోకి దిగి పనికానిచ్చేశారని...పైకి మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్పే సర్కారు పెద్దలు మాత్రం తమ అవసరాల కోసం అని పోయింది ప్రజల సొమ్మే కదా అని ఆ అక్రమార్కుడిని వదిలేశారు. అంతే కాదు..కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషన్ పై వచ్చిన ఆయన్ను ఎలాంటి చర్యలు లేకుండా పంపించేశారు. అవినీతిరహిత, పారదర్శక పాలన అంటే ఇదేనేమో.

Next Story
Share it