Telugu Gateway
Andhra Pradesh

‘ఈనాడు’ బాధ్యతల నుంచి తప్పుకున్న రామోజీరావు

‘ఈనాడు’ బాధ్యతల నుంచి తప్పుకున్న రామోజీరావు
X

ఈనాడు. రామోజీరావు. ఈ రెండింటికి విడదీయలేని బంధం. అలాంటిది రామోజీరావు తాజాగా చీఫ్ ఎడిటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇది ఒక రకంగా సంచలనమే. ఎందుకంటే ఈనాడు పేరు చెపితే గుర్తొచ్చొది రామోజీరావు తప్ప..మరెవరూ కాదు. కానీ మారిన పరిస్థితుల్లో ఆయన చీఫ్ ఎడిటర్ బాధ్యతల నుంచి తప్పుకుని కొత్తగా ఇద్దరు ఎడిటర్లను తెరపైకి తీసుకొచ్చారు. ఈనాడు వ్యవస్థలో ఎడిటర్ రావటం కూడా ఇదే తొలిసారి. ఇంత వరకూ చీఫ్ ఎడిటర్ పేరుతోనే పత్రిక నడిచింది. ఇప్పుడు కొత్తగా ఎడిటర్ వ్యవస్థను తీసుకొచ్చారు.

తెలంగాణ ఎడిషన్ కు డీఎన్ ప్రసాద్ ను ఎడిటర్ ను చేశారు. ఏపీ ఎడిషన్ కు మాత్రం ఎం. నాగేశ్వరరావుకు ఎడిటర్ బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామం ఇటు మీడియాతోపాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మీడియా ఇప్పుడు ఒక రకమైన విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటుంది. గతంలో ఎన్నడూలేని రీతిలో ప్రభుత్వాలు మీడియాను టార్గెట్ చేశాయి. తమకు వ్యతిరేక వార్తలు వస్తే టార్గెట్ చేస్తున్నాయి. ఇక నుంచి రామోజీరావు ఈనాడు ఫౌండర్ మాత్రమే. అంటే రోజువారీ వ్యవహారాల్లో ఆయనకు ఏ మాత్రం సంబంధం ఉండదన్న మాట.

Next Story
Share it