Telugu Gateway
Andhra Pradesh

చేనేత కార్మికులకు ‘పవన్’ ఓపెన్ ఆఫర్

చేనేత కార్మికులకు ‘పవన్’ ఓపెన్ ఆఫర్
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేనేత కార్మికులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఏపీలోని చేనేత సంఘాలు చర్చించి తమ ఉత్పత్తులుకు ఓ బ్రాండ్ నేమ్ క్రియేట్ చేయగలిగితే తాను వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ గురువారం నాడు మదనపల్లిలో చేనేత కార్మికులతో సమావేశం అయి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. “దురదృష్టవశాత్తు రాష్ట్రంలో చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ లేదు. రాష్ట్రంలో ఉన్న అన్ని చేనేత సంఘాలు చర్చించి బ్రాండ్ నేమ్ క్రియేట్ చేయగలిగితే దానిని నేను అంబాసిడర్ గా ఉండి ప్రమోట్ చేస్తాను. 10 మందికి తెలిసిన వ్యక్తి ప్రచారం చేస్తే శ్రమకు తగ్గ ఫలితం, గుర్తింపు వస్తుంది. ఎప్పుడో కోలా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేశాను. అయితే నేను వాడని వాటికి అంబాసిడర్ గా చేయడం కరెక్టు కాదని తప్పుకున్నాను. చేనేత ఉత్పత్తులు వాడుతాను కనుక బ్రాండింగ్ చేస్తాను. చేనేత మగ్గం తొక్కి తొక్కి ఆడపడుచులకు గర్భసంచి సమస్యలు వస్తాయి. వాటిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

దేవాలయాల్లో స్వామి, అమ్మవార్లకు సమర్పించడానికి పట్టుబట్టలను చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలా చేయడం వల్ల చేనేతకు గుర్తింపు ఇచ్చిన వారమవుతాము. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సంఘాలతో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశంలో చేనేత కార్మికుల సమస్యపై మరింత కూలంకుషంగా చర్చిద్దామని” హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం, గుర్తింపుగానీ రావడం లేదని అన్నారు. వస్త్రాలపై డిజైన్స్ వేయాలంటే ఎంత శ్రమతో కూడుకున్న పనో తెలుసని, అందుకే చేనేత కార్మికులను చేనేత కళాకారులు అని పిలుస్తానని అన్నారు. అరుదైన చేనేత కళను కాపాడుకోవాలన్న ఆయన .. ఆ కళను పరిరక్షించే వాళ్లకు పది రూపాయలు ఎక్కువ రావాలని కోరుకున్నారు.

జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. "మదనపల్లి పట్టణానికి చాలా చరిత్ర ఉంది. స్వాతంత్ర్యానికి ముందు చాలామంది మహనీయులు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న పోరాటంలో భాగస్వాములు అయ్యారు. మదనపల్లిలో చేనేత కార్మిక సంఘాలు అసోషియేషన్ గా ఏర్పడి కార్పొరేట్ సొసైటి ద్వారా పనిచేస్తున్న తీరు అభినందనీయం. ఇది రాజకీయ లబ్ధి కోసం ఏర్పాటు చేసిన సమావేశం కాదు. చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడానికి మాత్రమే ఏర్పాటు చేశాం. పోరాటయాత్ర సందర్భంగా ధర్మవరంలో చేనేత కార్మికులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నాం. వారు ఇచ్చిన సలహాలు, సూచనలను మ్యానిఫెస్టోలో పెట్టాం. జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కచ్చితంగా మీకు న్యాయం చేస్తుంది" అన్నారు.

Next Story
Share it