Telugu Gateway
Politics

మహారాష్ట్ర స్పీకర్ గా నానా పటోలే

మహారాష్ట్ర స్పీకర్ గా నానా పటోలే
X

మహారాష్ట్రలో పరిణామాలు చకచకా ముందుకు సాగుతున్నాయి. పలు మలుపుల తర్వాత రాష్ట్రంలో శివసేన నేతృత్వంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. శనివారం నాడే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శాసనసభలో బలనిరూపణ చేసుకున్నారు. దీంతో అత్యంత కీలకమైన కార్యక్రమం పూర్తి అయినట్లు అయింది. ఇదిలా ఉంటే ఆదివారం నాడు మరో కీలక ఘట్టం ముగిసింది. అదేంటి అంటే స్పీకర్ ఎన్నిక పూర్తయింది. స్పీకర్ ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించిన ప్రతిపక్ష బిజెపి తర్వాత వెనక్కి తగ్గింది. మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పదవికి బీజేపీ అభ్యర్థి కిషన్‌ కథోర్‌ వేసిన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా కథోర్‌ను నామినేట్‌ చేశామని.. అయితే స్పీకర్‌ ఎన్నికలో ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకూడదనే సంప్రదాయాన్ని పాటించామన్నారు.

తమ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ చెప్పారు. పొత్తులో భాగంగా స్పీకర్ పదవిని కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. ఆదివారం ఉదయం సమావేశమైన అసెంబ్లీలో, ప్రోటెమ్ స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్, స్పీకర్ గా నానా పటోలే ఎన్నిక ఏకగ్రీవమైందని ప్రకటించారు. విదర్భ ప్రాంతం నుంచి వచ్చిన నానా పటోలే, మోదీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన తొలి నేతల్లో ఒకరు. ఆయన కాంగ్రెస్ లో చేరి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై పోటీ చేసి ఓడిపోయారు. ఆపై ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి, ఇప్పుడు స్పీకర్ గా ఎన్నికయ్యారు.

Next Story
Share it