Telugu Gateway
Politics

రేప్ కేసుల్లో ఉరే సరి..కెటీఆర్

రేప్ కేసుల్లో ఉరే సరి..కెటీఆర్
X

తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటీఆర్ ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగిన దారుణ ఘటనపై మరోసారి స్పందించారు. ఈ అంశంపై ఆయన ప్రధాని నరేంద్రమోడీకి ట్యాగ్ చేస్తూ పలు ట్వీట్లు చేశారు. రేప్ కేసుల్లో ఉరిశిక్షే సరైన మార్గమని పేర్కొన్నారు. సమీక్షకు అవకాశం లేకుండా ఈ శిక్షలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా కెటీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. న్యాయం ఆలస్యం అయితే న్యాయం జరగనట్టేనని అని పేర్కొన్నారు. ‘నిర్భయ ఘటన జరిగి 7 ఏళ్లు అయింది.. కానీ దోషులకు ఇప్పటికీ ఊరి శిక్ష విధించలేకపోయాం. ఇటీవల తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం జరిగింది.. ఈ కేసులో దోషులకు దిగువ కోర్టు ఊరి శిక్ష విధించింది. కానీ హైకోర్టు దానికి జీవిత ఖైదుగా మార్చింది. తాజాగా హైదరాబాద్‌లో యువ పశు వైద్యురాలిని అనాగరికంగా హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

కానీ న్యాయం కోసం దు:ఖిస్తున్న బాధితురాలి కుటుంబానికి ఏం హామీ ఇవ్వగలం. న్యాయం ఆలస్యం కావడం అంటే న్యాయం జరగకపోవడమే. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే.. ఇలాంటి ఘటనలపై ఒక రోజంతా చర్చ చేపట్టాలి. ఐపీసీ, సీఆర్‌పీసీలకు సవరణలు చేయాలి. మహిళలపై, పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనల్లో దోషులుగా తెలినవారికి వెంటనే ఊరి శిక్ష విధించాలి. దీనిపై సమీక్షకు ఆస్కారం లేకుండా చూడాలి. మన పురాతన చట్టాలను సవరించాల్సిన సమయం వచ్చింది. చట్టాలకు భయపడకుండా దారుణాలకు పాల్పడే జంతువుల నుంచి మన దేశాన్ని కాపాడుకోవడానికి వేగంగా చర్యలు చేపట్టాల్సి ఉంది. చట్టాలను సవరించి.. వీలైనంత వేగంగా న్యాయం జరగాలని కోరుకుంటున్న కోట్లాది మంది ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాన’ని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Next Story
Share it