Top
Telugu Gateway

కెసీఆర్ ‘రివర్స్’ గేర్లకు కారణాలేంటో?!

కెసీఆర్ ‘రివర్స్’ గేర్లకు కారణాలేంటో?!
X

కార్మికుల కోసం కేబినెట్ నిర్ణయాన్ని కెసీఆర్ పక్కన పెట్టరా?!

ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలను షాక్ కు గురిచేసిందనే చెప్పాలి. కేవలం ప్రభుత్వ మొండివైఖరి వల్ల పదుల సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు..సమ్మెతో ఏ మాత్రం సంబంధంలేని ప్రజలు మృత్యువాత పడ్డారు. సీఎం కెసీఆర్ కు కొంత మంది యూనియన్ నాయకులపై ఉన్న కోపమే దీనంతటికి కారణం అయిందనే విషయం ఆదివారం నాటి పరిణామాలతో తేలిపోయింది. ఒకప్పుడు అధికార పార్టీనే పెంచి పోషించిన యూనియన్ ఇప్పుడు కెసీఆర్ కు ఇష్టం లేకపోయేసరికి కార్మికులతోపాటు..రాష్ట్ర ప్రజలు అందరూ అదే బాట పట్టాలన్నమాట.

కెసీఆర్ ఇష్టమే రాష్ట్రం ఇష్టం కావాలి..కెసీఆర్ వ్యతిరేకిస్తే రాష్ట్రం వ్యతిరేకించాలి అన్న తరహాలో ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం ధోరణి సాగింది. ఆర్టీసీ సమ్మె సాగిన ఈ 54 రోజుల్లో ముఖ్యమంత్రి కెసీఆర్ స్పందించిన తీరుకి..ఆదివారం నాడు ఆర్టీసీ ఉద్యోగులతో వ్యవహరించిన తీరుకు మధ్య ఎన్ని వైరుధ్యాలు..ఎన్ని వింత వింత ప్రకటనలు ఉన్నాయో. అవేంటో ఓ సారి చూద్దాం..ఆర్టీసీ సమ్మె ఇల్లీగల్. ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది ఇల్లీగలే . కెసీఆర్. మరి ఇల్లీగల్ గా సమ్మె చేసిన వారికి ఆర్టీసీ జీతం ఎలా చెల్లిస్తుంది?. మరి ఇఫ్పుడు ఇల్లీగల్ సమ్మె లీగల్ అయిపోయిందా?. సమ్మె ఇల్లీగల్ అని ప్రభుత్వం హైకోర్టులో కూడా వాదించింది కదా?. కోర్టును కూడా పదే పదే ఇల్లీగల్ అని ప్రకటించాలని కోరింది కదా? . మరి సాక్ష్యాత్తూ సీఎం కెసీఆర్ ఇల్లీగల్ సమ్మె అని ప్రకటించి..ఇప్పుడు లీగలైజ్ చేశారా?

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణను ఎవరూ అడ్డుకోలేరు..5000 రూట్లను ప్రైవేట్ కు ఇస్తున్నాం. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్ తీర్మానం కూడా చేసింది. హైకోర్టు కూడా కేబినెట్ తీర్మానాన్ని అడ్డుకోలేదు. ఇది కేంద్ర చట్టం ప్రకారమే చేస్తున్నాం. కెసీఆర్. ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశంలో మాత్రం ఒక్క రూటును కూడా ప్రైవేట్ కు ఇవ్వటం లేదు. మరి కేబినెట్ తీర్మానం ఎందుకు చేసినట్లు?. మళ్లీ ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గినట్లు?. కార్మికుల కోసం కేబినెట్ నిర్ణయాన్ని కూడా కెసీఆర్ వెనక్కి తీసుకున్నారా?. కెసీఆర్ గురించి తెలిసిన వారెవరైనా దీన్ని నమ్ముతారా?. హైకోర్టులో దాఖలైన పిటీషన్ లోనూ ప్రభుత్వం ప్రైవేటీకరణకు అనుకూలంగా గట్టిగా వాదించింది కదా?. మరి ఇప్పుడు ఎందుకీ రివర్స్ గేర్?

ఏటా దాదాపు 700 కోట్లు చెల్లిస్తే కానీ ఆర్టీసీ నడవదు..ప్రభుత్వం అంత సాయం చేయలేదు. కెసీఆర్. మరి ఇప్పుడు ఏకంగా బడ్జెట్లో ఏటా వెయ్యి కోట్ల రూపాయలు పెడతామని సీఎం కెసీఆర్ ప్రకటించారు. అదెలా సాధ్యం. మాంద్యం పరిస్థితులు వెళ్ళిపోయాయా?. ఖజానా నిండుగా ఉందా?. ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్టీసీ సమ్మె విషయంలో కెసీఆర్ చేసిన ప్రకటనలు ఆ తర్వాత తీసుకున్న యూటర్న్ లు ఎన్నో. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన విలీనం అంశాన్ని ఆమోదించేది లేదని ఏకంగా కేబినెట్ లో పెట్టి మరీ కెసీఆర్ తీర్మానం చేయించారు.

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయరాదని సర్కారు విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దీంతో తప్పుపట్టాల్సింది ఏమీలేదు. అయినాసరే విలీనం చేయం అంటూ కేబినెట్ తీర్మానం పెట్టడమే వింత అని అధికార వర్గాలు అప్పట్లో వ్యాఖ్యానించాయి. ఇప్పుడు ప్రైవేటీకరణకు సంబంధించి కేబినెట్ లో తీర్మానం ఆమోదించి మరీ..దీన్ని మాత్రం అమలు చేయబోమని ప్రకటిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్న కుట్ర సిద్ధాంతం కూడా మాయమైపోయింది. ఆర్టీసీ కార్మికులు న్యాయబద్ధంగా అడిగిన డిమాండ్ల పరిష్కారానికి ససేమిరా అన్న సీఎం ఇప్పుడు అడకగపోయినా పదవి విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్ళకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

న్యాయం అయినా..ఏదైనా మేం చేయాలనుకుంటే చేస్తాం..మీరు అడిగితే మాత్రం చేయం అన్నట్లు కెసీఆర్ తీరు ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. కేవలం తనను ధిక్కరించారన్న కారణంతో కార్మిక సంఘం నాయకులపై ఉన్న కోపంతో 48 వేల మంది కార్మికుల కుటుంబాలను, కోట్లాది మంది ప్రజలకు సర్కారు మాత్రం 54 రోజులు చుక్కలు చూపించింది. కెసీఆర్ సడన్ గా ఇంతగా మారటానికి కారణం త్వరలో జరగబోయే మునిసిపల్ ఎన్నికలు కూడా ఓ కారణం అని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Next Story
Share it