Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు బాటలోనే జగన్

చంద్రబాబు బాటలోనే జగన్
X

కడప స్టీల్ కల నెరవేరుతుందా?

కష్టమే అంటున్న పరిశ్రమల శాఖ అధికారులు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు..వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనకు మధ్య ఒకటే తేడా ఉంది. అప్పుడు కనీసం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అత్యంత కీలకమైన ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) సరఫరా ఒప్పందం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇనుప ఖనిజం సరఫరాకు సంబంధించి ఎన్ ఎండీసీతో ఒప్పందం చేసుకున్నారు. ఇది కీలక పరిణామమే. అయితే మిగతా అంతా సేమ్ టూ సేమ్. ఏటా 30 లక్షల టన్నుల వార్షిక సామర్ధ్యంతో కూడిన స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అయ్యే వ్యయం 18 వేల కోట్ల రూపాయల నుంచి 20 వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. మరి ఏపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కోసం ఏర్పాటు చేసిన ఏపీ హైగ్రేడ్ స్టీల్ అంత భారీ పెట్టుబడి పెట్టగలదా?. అంటే అది జరిగే పనికాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం పెద్ద పెద్ద సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు శంకుస్థాపన సందర్భంగా ప్రకటించారు. అసలు అత్యంత కీలకమైన ప్రైవేట్ భాగస్వామి ఎంపిక చేయకుండా..ఎవరు ముందుకొస్తారో తెలియకుండా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన అంటే ఇది కూడా ఓ మొక్కుబడి వ్యవహారంగానే ఉందని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయంగా ప్రస్తుతం స్టీల్ డిమాండ్ తగ్గుముఖం పడుతోంది. ఆటోమొబైల్ రంగంతోపాటు పలు రంగాలు ఎన్నడూలేని రీతిలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ తరుణంలో ఏ పారిశ్రామికవేత్త అత్యంత రిస్క్ తీసుకుని ఏపీలో పది వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాడానికి ముందుకొస్తారు?. అది జరిగే పనికాదని పరిశ్రమల శాఖకు చెందిన ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. పోనీ ఎవరైనా పది వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చినా మిగిలిన డబ్బు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చగలదా? అంటే ఆ పరిస్థితి ఏ మాత్రం లేదు. ఏపీ ఇఫ్పటికే తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉంది. ఈ తరుణంలో స్టీల్ ప్లాంట్ కోసం పది వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగే పనికాదని చెబుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం మూడేళ్ళలో స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తామని ప్రకటించారు.

అసలు ఓ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయటం, దాని నిర్వహణ అన్నది జరిగే పనికాదని పారిశ్రామిక రంగ నిపుణులు చెబుతున్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా..22 ఎంపీ సీట్లు సాధించిన జగన్ కూడా చంద్రబాబు తరహాలో ఐదేళ్లు వేచిచూశాం..అందుకే సొంతంగా ఏర్పాటుకు పూనుకున్నామని చెప్పటం విచిత్రం. ఛంద్రబాబు ఐదేళ్లలో స్టీల్ ప్లాంట్ సాధించలేదని..అది ఫెయిల్యూర్ అని విమర్శించిన జగన్..ఇప్పుడు అదే బాటలో నడవటం వెనక మతలబు ఏంటి?. చంద్రబాబుతో పోలిస్తే జగన్ అన్ని రకాలుగా రాజకీయంగా శక్తివంతంగా ఉన్నారు. మరి కేంద్రం ఇవ్వకపోతే అలిగే మేమే పెట్టుకుంటాం అని రాష్ట్ర ప్రజలపై భారం మోపటం సరైన పనేనా?.

Next Story
Share it