జగన్ ది తుగ్లక్ చర్య..ఒక రాష్ట్రానికి మూడు రాజధానులా?
ఏపీ రాజధానికి సంబంధించి శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తుగ్లక్ చర్య అని మండిపడ్డారు. ఎక్కడైనా ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయా అని ప్రశ్నించారు. జగన్ తన చర్యలతో రాష్ట్రాన్ని పాతాళంలోకి నేట్టేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రం ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిగా మారిందని అన్నారు. తుగ్లక్ నిర్ణయాలను ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. భవిషత్తులో రాష్ట్ర దుస్థితి ప్రజావేదికను కూల్చిన చందంగా ఉండనుందా? అని ప్రశ్నించారు. ‘విభజన సమయంలో రాజధాని గురించే ఎక్కువ బాధపడ్డాం - రాజధాని అనేది ఒక స్టేటస్ - మనకు కూడా ఒక రాజధాని ఉండాలని కోరుకున్నాం .కొందరి కోసమే రాజధాని అనేది వాస్తవం కాదు.
అమరావతి ఉపాధి కల్పనకు కేంద్రంగా ఉండాలి. సంపద సృష్టించకపోతే ప్రభుత్వానికి ఆదాయం రాదు. డబ్బులు ఉంటేనే సంక్షేమ పథకాలు చేయగలుగుతాం . 13 జిల్లాల అభివృద్ధికి అమరావతి ఆదాయ వనరు. హైదరాబాద్‍ను అన్ని విధాలా అభివృద్ధి చేశాం. అమరావతి ప్రజా రాజధాని. భావితరాలకు అమరావతి కలల రాజధాని’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని విమర్శించారు. విశాఖపట్నంలో వైసీపీ నేతలు భూములు కొన్నారనే ఆరోపణలు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. వైజాగ్ సిటీని తాము అభివృద్ధి చేసినట్లు గా ఎవరూ చేయలేదని..అందుకే సిటీలో తామే గెలిచామని చంద్రబాబు అన్నారు.