Telugu Gateway
Andhra Pradesh

రాజధాని మారిస్తే ..రైతులకు 90 వేల కోట్లు చెల్లించగలరా?

రాజధాని మారిస్తే ..రైతులకు 90 వేల కోట్లు చెల్లించగలరా?
X

ఓ రాష్ట్ర రాజధాని మార్చటం అంటే పాత కారు తీసేసి కొత్త కారు కొనుక్కున్నంత తేలిక కాదని బిజెపి ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ..ఈ రాజధానుల వికేంద్రీకరణ ఏంటో అర్ధం కావటంలేదన్నారు. రాజధానిని మారిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని వ్యాఖ్యానించారు. సుజనా చౌదరి ఆదివారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కేంద్రంతో చర్చించాకే తాను ఈ మాటలు చెబుతున్నానని తెలిపారు. ఏపీ రాజధాని మార్పుపై రైతులు హైకోర్టుకు వెళితే వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బేనని అన్నారు. రైతులకు పరిహారంగా రూ. 80 నుంచి రూ. 90 వేల కోట్లు ఇవాల్సివస్తుందని అన్నారు. అంత డబ్బు ప్రభుత్వం దగ్గర ఉందా? అని సుజనా ప్రశ్నించారు. బ్యాంకు రుణాలు తీసుకుని రాజధానిలో నిర్మాణాలు చేపడుతున్నారని, కాంట్రాక్టర్లు కోర్టుకు వెళితే పరిహారం చెల్లిస్తారా?.. లక్షన్నర నుంచి రూ. 2లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తుందని సుజనాచౌదరి అన్నారు. అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు అవసరం లేదని సుజనాచౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాజధానిలో పెండింగ్‌ పనులు పూర్తి చేసి పాలనపై దృష్టిపెట్టాలన్నారు. ఏపీ అంటే.. వ్యాపారవేత్తలు వెయ్యి కిలోమీటర్లు పరిగెత్తే పరిస్థితికి తెచ్చారని విమర్శించారు. ప్రభుత్వాలు మారితే రాజధానులు మార్చడమేంటని ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతోందని సుజనాచౌదరి విమర్శించారు. రాజధాని సమస్యపై రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలు స్పందించాలని ఆయన కోరారు. అమరావతి కోసం బిజెపి శ్రేణులు అంతా పోరాటం చేయాలన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే విశాఖపట్నానికి కూడా ఏమీ మేలు జరగదని అభిప్రాయపడ్డారు. జీఎన్ రావు కమిటీ నివేదిక కూడా అర్ధంపర్ధం లేని నివేదిక అని విమర్శించారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా ఒకలా..అధికారంలోకి వచ్చాక ఒకలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Next Story
Share it