గొల్లపూడి మారుతిరావు మృతి
గొల్లపూడి మారుతిరావు ఇక లేరు. అనారోగ్యంతో ఆయన గురువారం నాడు తుది శ్వాస విడిచారు. బహుముఖ ప్రజ్ణాశాలి అయిన గొల్లపూడి టాలీవుడ్ లో విలక్షణ నటుడుగా గుర్తింపు దక్కించుకున్నారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఎన్నో పాత్రలను పోషించిన ఆయన ఈ పాత్రల్లో కూడా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ముఖ్యంగా పాత సినిమాల్లో మహిళలను వేధించే పాత్రల్లో ఆయన నటన చూసి బయట కూడా అమ్మాయిలు భయపడేంత సహజంగా ఉండేది ఆ నటన. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. మారుతి రావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు.
కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య- వీధిలో క్రిష్ణయ్య సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 250 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, నవలలు, కథలు రాసేవారు. డాక్టర్ చక్రవర్తి సినిమాతో రచయితగా సినిమాలోకానికి పరిచయం అయ్యారు. వినూత్న విలనిజానికి ఆయన పెట్టింది పేరు. రచయితగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా ఇలా అన్ని కోణాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. గొల్లపూడి మారుతి రావు ఏకంగా 290 చిత్రాల్లో నటించారు.