Telugu Gateway
Andhra Pradesh

జగన్ చేతికి రాజధాని కమిటీ నివేదిక

జగన్ చేతికి రాజధాని కమిటీ నివేదిక
X

ఏపీలో ప్రస్తుతం ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది రాజధాని అంశమే. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన పెద్ద దుమారమే రేపుతోంది. ఈ తరుణంలో సర్కారు నియమించిన రాజధాని కమిటీ తన తుది నివేదికను శుక్రవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందజేసింది. నివేదిక వివరాలు ఏమీ బహిర్గతం కాలేదు కానీ..జగన్ అసెంబ్లీలో ఏదైతే చెప్పారో నివేదికలోనూ అదే ఉంటుందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ నిపుణుల కమిటీ సభ్యులు రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణపై నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు తాము సందర్శించిన ప్రాంతాలు, అధ్యయనం చేసిన అంశాలను కమిటీ సభ్యులు నివేదిక ద్వారా సీఎంకు నివేదించారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు నిపుణుల కమిటీ కన్వీనర్‌ జీఎన్‌ రావు, సెక్రటరీ చల్లా విజయ్‌ మోహన్, సభ్యులు డాక్టర్‌ అంజలి మోహన్, కె.టి.రవీంద్రన్, డాక్టర్‌ మహావీర్, డాక్టర్‌ సుబ్బారావు పాల్గొన్నారు.సెప్టెంబర్‌ 13న ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీ నివేదికపై చర్చించేందుకు ఈ నెల 27న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. తర్వాత అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it