Telugu Gateway
Andhra Pradesh

రేప్ కేసు నిర్ధారణ అయితే ఏపీలో ఉరే

రేప్ కేసు నిర్ధారణ అయితే ఏపీలో ఉరే
X

ఏపీ అసెంబ్లీ అత్యంత కీలకమైన ‘దిశ చట్టానికి’ ఆమోదం తెలిపింది. దీంతో ఏపీలో రేప్ కేసులో ఎవరైనా దోషిగా తేలితే వారికి ఉరి శిక్ష పడనుంది. ఈ మేరకు చట్టంలో మార్పులు చేశారు. అయితే శిక్షలకు సంబంధించిన చట్ట సవరణకు రాష్ట్రపతి ఆమోదం లభించాకే అమల్లోకి వస్తుంది. ఈ కేసులను తేల్చేందుకు ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కోర్టులకే ఈ చట్టం ఆమోదంతో మార్గం సుగమం కానుంది. అసెంబ్లీలో దిశ బిల్లు పాస్‌ అయినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి ఆమోద ముద్ర వేసింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు.

వారంరోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ వస్తుంది. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిశ యాక్ట్‌ పై మాట్లాడుతూ మహిళలపై దాడి చేయాలన్న ఆలోచన వస్తే వణుకు పుట్టేలా చట్టం తీసుకొచ్చామని చెప్పారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని సీఎం జగన్‌ అన్నారు. నేరం చేస్తే కఠిన శిక్ష పడుతుందనే భయం ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని సీఎం అభిప్రాయపడ్డారు.

Next Story
Share it