Telugu Gateway
Telangana

ఇంత దారుణం జరిగితే కెసీఆర్ స్పందించరా?

ఇంత దారుణం జరిగితే కెసీఆర్ స్పందించరా?
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తీరును కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. వెటర్నరీ డాక్టర్ ను రేప్ చేసి..సజీవ దహనం వంటి దారుణ ఘటన జరిగినా సీఎం కెసీఆర్ స్పందించకపోవటం సరికాదన్నారు. సీఎం కెసీఆర్ కు, మంత్రులకు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించే తీరికలేదా అని ప్రశ్నించారు. మనిషన్న ప్రతి వాడు ఈ ఘటనపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఆదివారం నాడు బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్ళగా ఆయన్ను పోలీసులు అనుమతించలేదు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన బాధాకరమన్నారు. నిఘా వ్యవస్థ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.

తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు సరైన రీతిలో స్పందించలేదన్నారు. బాధితురాలు నివాసం ఉండే ప్రాంత ప్రజలు తమ గేటెడ్ కమ్యూనిటీ ప్రవేశ ద్వారానికి తాళాలు వేసి పోలీసులు, మీడియాను అనుమతించలేదు. అదే సమయంలో కొంత మంది మహిళలు సీఎం కెసీఆర్, ప్రధాని మోడీ తీరును తప్పుపట్టారు. వీరిద్దరూ ఇంత దారుణ ఘటనపై ఎందుకు స్పందించటంలేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఓ వైపు భేటీ బచావ్..భేటీ పడావ్ అంటూ నినాదాలు అయితే చేస్తారు కానీ ఈ దారుణ ఘటనపై స్పందించటానికి సమయం లేదా? అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సీఎం కెసీఆర్ తీరును కూడా వీళ్ళు తప్పుపట్టారు.

Next Story
Share it