‘నేనే గెలిపించా...నేనే కన్పించాలి’
ఇదే జగన్ విధానమా? అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చ
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఆరు నెలల కాలంలో భారీ ఎత్తున ప్రభుత్వ ప్రకనటలు విడుదల చేస్తోంది. పేజీలకు పేజీలు యాడ్స్ ఇస్తోంది. ఒక్క ఏపీలోనే కాదు తెలంగాణలోనూ ఈ యాడ్స్ వస్తున్నాయి. అయితే పేజీలకు పేజీలుగా వచ్చే ఈ యాడ్స్ లో ఒక్క ముఖ్యమంత్రి ఫోటో తప్ప..మంత్రుల ఫోటోలు నామమాత్రంగా కూడా కన్పించటం లేదు. ఏపీలో వైసీపీని గెలుపు తీరాలకు చేర్చటంలో అంతా తానే నడిపించాను కాబట్టి మిగిలిన వాళ్ళ ఉనికిని కూడా గుర్తించను అనే తరహాలో జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఖచ్చితంగా ఏపీలో వైసీపీ అధికారంలోకి రావటానికి జగన్మోహన్ రెడ్డిదే ప్రధాన వాటా. ఈ గెలుపులో జగన్మోహన్ రెడ్డి వాటా 75 శాతం అయితే..మిగిలిన నేతల వాటా కూడా కనీసం 25 శాతం ఉంటుందని..ఈ రెండూ కలిపితేనే వంద శాతం అవుతుంది తప్ప..ఒక్క జగన్మోహన్ రెడ్డితోనే వంద శాతం పూర్తి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తన వల్లే గెలుపు అనే భావనతోనే జగన్ ‘నేనే గెలిపించా..నేనే కన్పించాలి’ అనే మోడల్ ను ఫాలో అవుతున్నట్లు కన్పిస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వ యాడ్స్ లో మంత్రుల ఫోటోలను వేయటానికి సుప్రీంకోర్టు ఆదేశాలు అని చెబుతున్నారు. కానీ అందులో ఏ మాత్రం వాస్తవం లేదన్నది అధికారుల వాదన. 2015 మేలో తొలుత సుప్రీంకోర్టు కేవలం రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ఫోటోలు మాత్రమే యాడ్స్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై అప్పట్లో అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేశాయి.
ప్రధాని అయినా..ముఖ్యమంత్రి అయినా ఆయా కేబినెట్ ల్లో ప్రథముడే అని అంత మాత్రాన మంత్రుల ఫోటోలు వద్దనటం సరికాదని ఆయా రాష్ట్రాలు వాదించాయి. దీనిపై సుప్రీంకోర్టు 2016 మార్చిలో తన ఆర్డర్ ను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ యాడ్స్ లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్ట్ర మంత్రుల ఫోటోలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల పేరు చెప్పి ఎక్కడా యాడ్స్ లో మంత్రుల ఫోటోలు లేకుండా చేస్తోంది. కోట్లాది రూపాయల వ్యయంతో చేసే యాడ్స్ లో తన సహచర మంత్రులను జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడం సరైన సంకేతాలు పంపించదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ యాడ్స్ లో మంత్రుల ఫోటోలు ఉపయోగిస్తున్నారు. గత టీడీపీ ప్రభు్త్వ హయాంలోనూ సంబంధిత శాఖల మంత్రులు ఫోటోలు యాడ్స్ లో వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.