Telugu Gateway
Andhra Pradesh

జనసేనపై వైసీపీ మూకుమ్మడి దాడి

జనసేనపై వైసీపీ మూకుమ్మడి దాడి
X

అధికార వైసీపీ జనసేన పై మూకుమ్మడి దాడికి దిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోని ఇసుక సమస్యపై తలపెట్టిన ‘లాంగ్ మార్చ్’ టార్గెట్ గా ఏపీ మంత్రులు..వైసీపీ ఎమ్మెల్యేలు పవన్ పై విమర్శలు గుప్పించారు.లాంగ్ మార్చ్ కు ముందు రోజు కూడా వైసీపీ మంత్రులు ముగ్గురు, నలుగురు జనసేనప తీవ్ర విమర్శలు చేశారు. ఓ వైపు విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ జరుగుతుండగానే వైసీపీ నేతలు విమర్శల జోరు పెంచారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసింది లాంగ్‌ మార్చ్‌ కాదని, రాంగ్‌ మార్చ్‌ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ విమర్శించారు. చంద్రబాబు తనయుడు లోకేశ్‌ రాజకీయాలకు పనికిరాడని, అందువల్ల పవన్‌ను టీడీపీ అధ్యక్షుడిని చేయాలన్నారు. పవన్‌ కల్యాణ్‌కు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ నటించడం అలవాటైపోయిందని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆరోపించారు.

అందులో భాగంగానే విశాఖలో లాంగ్‌మార్చ్‌ పేరుతో చంద్రబాబు డైరెక్షన్‌లో నటిస్తున్నాడని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో టీడీపీ నేతలు ఇసుక దోపిడీ చేస్తూ.. మహిళా అధికారులపైన దాడులకు పాల్పడితే అప్పుడు పవన్‌ గాడిదలు కాశాడా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు తెరవెనక పొత్తులు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలు.. ఇప్పుడు ప్రత్యక్షంగానే కలసిపోయాయని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు విమర్శించారు. గత ప్రభుత్వంలో టీడీపీ ఇసుక అక్రమ రవాణాపై పవన్‌ నోరు విప్పలేదని అన్నారు. 50 రోజులుగా కృష్ణా, గోదావరి, పెన్నా నదులకు వరద పోటెత్తిందని.. ఈ సమయంలో ఇసుకతీత ఎలా సాధ్యమో పవన్‌ చెప్పాలన్నారు.

Next Story
Share it