Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ నేతల్లో అప్పుడే ఎందుకింత అసహనం?!

వైసీపీ నేతల్లో అప్పుడే ఎందుకింత అసహనం?!
X

అధికారంలో వచ్చి ఇంకా ఆరు నెలలే. అప్పుడే వైసీపీ నేతలు ఎందుకింత అసహనం చూపిస్తున్నారు?. ఆ పార్టీ నేతలు..మంత్రులు..ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలే ఏపీలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి. విచిత్రం ఏమిటంటే ఇందులో ఏకంగా స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా భాగస్వాములు కావటం. సాక్ష్యాత్తూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకుని ఇదే వైసీపీ నేతలు స్పీకర్ గా కోడెల శివప్రసాద్ రావు ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్పీకర్ గా ఉండి రాజకీయ వ్యాఖ్యలు చేసి కోడెల కూడా వివాదాలు కొని తెచ్చుకున్నారు. సభలో వ్యవహరించిన సంగతి అటు ఉంచితే..సభ బయట కూడా ఆయన వ్యవహారశైలి తీవ్ర విమర్శల పాలైంది. మరి ఇఫ్పుడు తమ్మినేని సీతారాం చేస్తున్నది ఏమిటి?. కొద్ది రోజుల క్రితం ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో ఫక్తు రాజకీయ విమర్శలు చేశారు. అవి కూడా పెద్ద దుమారం రేపాయి.

తాజాగా తమ్మినేని చేసిన రాజకీయ విమర్శలు మరింత దారుణంగా ఉన్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణదీ అదే తీరు. రాజధాని అమరావతిపై శ్మశాసనం అంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఐదేళ్ళలో అక్కడ ఏమి కట్టిందీ చంద్రబాబుకు తెలియదా?. ఏమి ఉందని చూస్తారు అనటం వేరు..శ్మశాసనంలో ఏమి ఉంది చూడటానికి వస్తారు అనటం వేరు. చప్పట్లు కొట్టలేదనే కారణంతో మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్ నిరుద్యోగ యువతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది ఒకెత్తు అయితే మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు అయితే ఇక విమర్శలకు పరాకాష్ట అనే చెప్పొచ్చు. ‘నేనింతే’ టైపులో కొడాలి నాని చేస్తున్న విమర్శలు కలకలం రేపుతున్నాయి. టీడీపీపై పరుషమైన పదజాలంతో వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేయటం ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల కంటే చర్చ ఈ తిట్లవైపే మళ్ళుతోంది. టీడీపీకి..చంద్రబాబుకు కావాల్సింది కూడా అదే.

చూస్తుంటే వీళ్లంతా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి ట్రాప్ లో పడుతున్నట్లే కన్పిస్తోంది. అంటే టీడీపీ విమర్శలకు సమాధానం చెప్పొద్దా అన్న ప్రశ్న వెంటనే ఉదయిస్తుంది...టీడీపీల విమర్శలకు సమర్ధవంతంగా కౌంటర్లు ఇవ్వటం వేరు...రాజకీయ ప్రత్యర్ధులను బూతులు తిట్టడం వేరు. విమర్శల స్థానే బూతులు రావటంతో చర్చను టీడీపీ అటువైపు మళ్ళిస్తోంది. అదే ఇప్పుడు వైసీపీకి పెద్ద మైనస్ గా మారుతోందని ఆ పార్టీ నేతలే అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం మీడియాలో ఉండటం అనేది చంద్రబాబు మోడల్. అందుకు మీడియా సహకారం కూడా ఓ రేంజ్ లో ఉంటంది. చంద్రబాబు చేసే విమర్శలు..దూకుడు ప్రతికూల ఫలితాన్ని ఇస్తుందా..అనుకూల ఫలితాన్ని ఇస్తుందా అన్నది వేరే సంగతి. చంద్రబాబు టార్గెట్ నిత్యం వార్తల్లో ఉండటం.

అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ప్రతిపక్షంలో ఉండగా ఆయన పెద్దగా మీడియా ముందుకు వచ్చింది లేదు. అధికారంలోకి వచ్చాక కూడా అదే స్టైల్ కొనసాగిస్తున్నారు. ఈ ఆరు నెలల్లో ఆయన ఢిల్లీలో ఒక్కసారి మీడియా సమావేశంలో మాట్లాడారు అంతే. అదే చంద్రబాబు పెట్టిన మీడియా సమావేశాలు అయితే లెక్కేలేదు. వైసీపీ నేతలు..మంత్రులే సాక్ష్యాత్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో పరుష వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికారంలో ఉండగా అసెంబ్లీలో, బయటా టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఫలితం ఏంటో 2019 ఎన్నికల్లో ఆ పార్టీ చూసింది. అయినా సరే మరి వైసీపీ నేతలు అదే బాటను ఎందుకు ఎంచుకున్నారు?.

Next Story
Share it