Telugu Gateway
Andhra Pradesh

అసలు ఏపి ప్రభుత్వంలో ఏమి జరుగుతోంది?

అసలు ఏపి ప్రభుత్వంలో ఏమి జరుగుతోంది?
X

‘నాకు చెప్పకుండా పేరు ఎలా మారుస్తారు. వెంటనే జీవో మార్చేయండి. అబ్దుం కలాం పేరు కొనసాగించండి.’ ఇదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జారీ చేసిన ఆదేశం. ఈ విషయం దేనికి సంబంధించి అంటారా?. విద్యా శాఖ సోమవారం నాడు ఓ ఉత్తర్వు జారీ చేసింది. ఇప్పటివరకూ ప్రతి ఏటా డాక్టర్ అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార అవార్డులు పేరిట అవార్డులు ఇచ్చేవారు. అయితే పాఠశాల విద్యా శాఖ ఈ ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు తీసేసి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేరిట ‘వైఎస్ఆర్ విద్యా పురస్కారాలు’ పేరిట మంజూరు చేయటానికి వీలుగా జీవో 78 జారీ చేసింది. అయితే ఇది వివాదస్పదం కావటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తక్షణమే జీవో 78ని రద్దు చేసి..అబ్దులా కలాం పేరు మీదే అవార్డులు కొనసాగించాలని ఆదేశించారు. ఈ వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో కూడా కలకలం రేపుతోంది.

మాజీ రాష్ట్రపతి..దేశంలో కోట్లాది మంది అభిమానించే అబ్దుల్ కలాం పేరుతో ఉన్న అవార్డులకు ఆయన పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెడుతూ జీవో ఇవ్వటం...మళ్ళీ దాన్ని మరుసటి రోజే రద్దు చేయాలని నిర్ణయించటంతో అసలు ప్రభుత్వంలో ఏమి జరుగుతోంది అంటూ వైసీపీ నేతలు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి. అబ్దుల్ కలాంతో పాటు రాబోయే రోజుల్లో ఇతర మహనీయుల పేర్లు పెట్టాలని జగన్ సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీనే ఏపీలో పెద్ద దుమారం రేపుతోంది. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్స్ కు సంబంధించిన ఫైలు ఆర్ధిక శాఖకు పంపకుండా నేరుగా కేబినెట్ లో పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీఎస్ ఏకంగా సీఎంవోలోని కార్యదర్శి ప్రవీణ్ ఫ్రకాష్ కు మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే సీఎం మాత్రం తాను చెపిన తర్వాత ..కేబినెట్ ఆమోదించాక ఎల్వీ అభ్యంతరాలు వ్యక్తం చేయటంపై అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఎల్వీ బదిలీ వెనక ఈ మెమో కూడా ప్రధాన కారణం అని చెబుతున్న సంగతి తెలిసిందే.

అయితే వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అవార్డుల కింద ఇచ్చే నగదు కానీ..ఇతర ప్రోత్సాహకాలు ఆర్ధిక శాఖ అనుమతి ఉంటేనే మంజూరు అవుతాయి తప్ప..సీఎం మౌఖిక ఆదేశాలతో సాధ్యంకాదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. సీఎం చెప్పినా కూడా ప్రభుత్వంలో ఏ పనికి నిదులు మంజూరు చేయాలి అన్నా ఆర్ధిక శాఖ అనుమతి తప్పనిసరి అన్న సంగతి సీఎంవో అధికారులు సీఎంకు చెప్పరా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దేనికైనా ఆర్ధిక శాఖ అభ్యంతరం చెప్పినా దాన్ని తిరస్కరించే అధికారం సీఎంకు ఉంటుంది. సీఎంవోలో ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, పలు కీలక శాఖల్లో పనిచేసిన సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాంతోపాటు సీనియర్ అధికారులు పీ వీ రమేష్ వంటి వాళ్ళు ఉన్నా కూడా అధికార వ్యవస్థలో ఫ్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల తర్వాత కూడా ఇంత గందరగోళం ఏంటో అర్ధం కాకుండా ఉందని ఐఏఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it