Top
Telugu Gateway

ఆర్టీసీ కార్మికులే ఈ నాటి విజేతలు!

ఆర్టీసీ కార్మికులే ఈ నాటి విజేతలు!
X

అంతిమ ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ..ఈ నాటి విజేతలు మాత్రం ఆర్టీసీ కార్మికులే. తెలంగాణ నీళ్ళలోనే మొండితనం, కసి ఉంది..అది సీఎం కెసీఆర్ ఒక్కరిలోనే కాదు..మాలో కూడా ఉంది అని నిరూపించారు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కెసీఆర్ రెండుసార్లు ఆర్టీసి కార్మికులకు డెడ్ లైన్లు పెట్టినా వాళ్లు ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా సీఎం కెసీఆర్ యూనియన్ నాయకులే కార్మికులను రోడ్డున పడేస్తున్నారు అని విమర్శిస్తున్నారు. ఓ అర డజను మంది యూనియన్ నేతల కోసం దాదాపు ఏభై వేల మంది కార్మికులు తమ జీవనోపాధిని, భవిష్యత్ ను వదులు కోవటానికి సిద్ధపడతారా? నాయకుల కోసం కార్మికులు తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటారా?. వేలాది మంది కార్మికులకు ఆ మాత్రం తెలియదా?. అంటే ఖచ్చితంగా నో అని చెప్పొచ్చు. తమ డిమాండ్లలో న్యాయం ఉందని నమ్మబట్టే కార్మికులు, యూనియన్లు కలసి ఉన్నాయని చెప్పాల్సిందే.

ఓ వైపు ఒత్తిడితో కొంత మంది ఆర్టీసి కార్మికులు గుండెలు ఆగి చనిపోతున్నారు. మరికొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా సరే మిగిలిన వారంతా కూడా మొండిగా పోరాటానికే మొగ్గుచూపుతున్నారు కానీ ఏ మాత్రం వెన్నుచూపటం లేదు. సీఎం కెసీఆర్ రెండవ సారి పెట్టిన ‘డెడ్ లైన్’ మంగళవారం అర్ధరాత్రితో ముగిసిపోయినా స్పందించిన వాళ్ళు నామమాత్రమే అంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. సహజంగా ఓ ప్రైవేట్ కంపెనీలో నుంచి ఎవరినైనా ఉద్యోగంలో నుంచి తీసేయాలంటే ఓ నోటీసు ఇవ్వాలి. ఆ కంపెనీ నిబంధనల ప్రకారం నెల రోజుల ముందో.మూడు నెలల ముందో సమాచారం ఇవ్వాలి. అటు ఉద్యోగి అయినా..ఇటు కంపెనీ అయినా ఇదే నిబంధన పాటించాలి. అలాంటిది సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి ఓ నోటి మాటగా ఏభై వేల మంది ఓ ప్రభుత్వ కార్పొరేషన్ ఉద్యోగులు ఫలానా తేదీలోగా రాకపోతే వారి ఉద్యోగాలు పోతాయి అంటే చెల్లుబాటు అవుతుందా?. దీనికి చట్టబద్దత ఉంటుందా?.

ప్రభుత్వం అలా చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకు నోటీసులు ఇవ్వాలే కానీ...నోటి మాటలు చెపితే ఉద్యోగాలు పోతాయా?. ఓ వైపు యూనియన్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని చెబుతున్న కెసీఆర్ ఇలాంటి మాటలతో కార్మికులను బెదిరిస్తున్నారని రాజకీయపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆర్టీసి సమ్మె వల్ల తెలంగాణ అంతా సామాన్య ప్రజలతోపాటు విద్యార్ధులు..ఉద్యోగులు నానా కష్టాలు పడుతున్నారు. అయినా సరే ఎక్కడా కార్మికులపై పెద్దగా వ్యతిరేకత వస్తున్నట్లు కన్పించటం లేదు. పైగా ప్రభుత్వం కనీసం వారితో చర్చలు జరిపి..కార్మికులు పెట్టిన డిమాండ్లలో ఒకటో..రెండో...మూడో పరిష్కరించి మిగతా వాటి సంగతి తర్వాత చూద్దాం అని చెప్పినా ప్రజలు అప్పుడు కార్మికులను తప్పుపట్టి ఉండే వారు. కానీ ప్రభుత్వపరంగా ఆ దిశగా జరిగింది శూన్యం. కోర్టు ఆదేశాలకు మేర అయినా ఈడీల కమిటీ చెప్పిన చిన్న చిన్న డిమాండ్లకు అయ్యే డబ్బును ఇవ్వటానికి కూడా సర్కారు ససేమిరా అంటోంది?.

అందుకే ప్రజలు కూడా ఆర్టీసీ కార్మికులపై పెద్దగా ఎక్కడా తిరుగుబాటు చేస్తున్నట్లు కన్పించలేదు. పైగా కొంత మంది వాళ్లకు మద్దతే ప్రకటిస్తున్నారు. నెల రోజులు దాటినా పట్టుసడలకుండా సమ్మె కొనసాగిస్తూ ఆర్టీసీ కార్మికులు ఓ చరిత్ర సృష్టించారనే చెప్పాలి. ఓ వైపు హుజూర్ నగర్ ఫలితమే అసలు సిసలు ప్రజాతీర్పు ఇక తాము ఎవరి మాటా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లు సర్కారు వ్యవహరిస్తోంది. నిజంగా ఆర్టీసి కార్మికుల సమ్మె పూర్తిగా తప్పు.. ఏ మాత్రం న్యాయసమ్మతం కాదని ప్రజలు భావించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎక్కువ మంది మాత్రం ప్రభుత్వం పిలిచి చర్చించి...వాళ్ళ న్యాయసమ్మతమైన డిమాండ్లను పరిష్కరించాలనే అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it