Top
Telugu Gateway

రెండు లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని నడిపిస్తారు..ఆర్టీసీని నడపలేరా?!

రెండు లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని నడిపిస్తారు..ఆర్టీసీని నడపలేరా?!
X

రెండు లక్షల కోట్ల రూపాయల అప్పుతో రాష్ట్రాన్ని నడిపించే తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్..రెండు వేల కోట్ల రూపాయల అప్పుతో ఆర్టీసిని నడపలేరా?. 2019 నవంబర్ వరకూ ఆర్టీసీ అప్పు 2209 కోట్ల రూపాయలుగా సర్కారు తాజాగా హైకోర్టుకు నివేదించింది. అప్పులు..నష్టాలే ఆయా సంస్థల నిర్వహణకు ప్రామాణికం అయితే రాష్ట్రమే పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకుపోయింది కదా?. మరి అలాంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు పేదలు, మధ్య తరగతి ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్ధులకు ఎంతో సేవలు అందించే ఆర్టీసీ విషయంలో సర్కారు ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తుంది అన్నది ఎవరికీ అంతుబట్టని వ్యవహారంగా మారింది. ఆర్టీసీ అంటే అదేదో 48 వేల ఉద్యోగులకు సంబంధించిన అంశమే కాదు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మంది ప్రజలు ఆధారపడిన రవాణా సౌకర్యం అన్న సంగతి తెలిసిందే. నలభై రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల సామాన్యులు నానా కష్టాలు పడుతుంటే..పేద, మధ్య తరగతి ప్రజలు, విద్యార్ధులు ఆర్టీసీ నడిచే రోజుల్లో కూడా ఇప్పుడు భారీ ఎత్తున నష్టపోవాల్సి వస్తోంది.

దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ అయిన ఇండియన్ ఎయిర్ లైన్స్ కు గత ప్రభుత్వాలు అన్నీ కలిపి వేల కోట్ల రూపాయల ఆర్ధిక సాయం అందించాయి. ఎయిర్ లైన్స్ నడుపుతూనే ఉన్నారు తప్ప...మూసివేత మాత్రం చేయలేదు. ఇఫ్పుడు ప్రైవేటీకరణ దిశగా ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇండియన్ ఎయిర్ లైన్స్ మూసివేత అంటూ జరిగితే దేశీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడటంతో పాటు...ప్రయాణికులు కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కానీ కెసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన అప్పే దగ్గర దగ్గరగా 1.70 లక్షల కోట్ల రూపాయల వరకూ ఉంది. కానీ కేవలం రెండున్నర వేల కోట్ల రూపాయల అప్పు ఉందనే సాకుతో ఆర్టీసీపై ప్రభుత్వం కఠిన వైఖరి అనుసరిస్తుండటం విశేషం. ‘ఆర్టీసిని నడపటం కష్టం. ఇక దాని కథ ముగిసినట్లే?. ఎవరూ దాన్ని బాగు చేయలేరు. ’ ఇవీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తాజాగా చేసిన సమీక్షల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు.

పోనీ గత ఆరేళ్ళలో సీఎం కెసీఆర్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి..మీకు ఇప్పటివరకూ సమయం ఇస్తున్నా..అప్పటిలోగా సంస్థను గాడిలో పెట్టకపోతే ప్రైవేట్ పరం చేస్తా వంటి హెచ్చరికలు ఏమైనా చేశారా? అంటే అదీలేదనే చెబుతున్నాయి అధికార వర్గాలు. కానీ కార్మికులు సమ్మెకు వెళ్ళారనే ఏకైక కారణం చూపి రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలకు సేవలు అందించే సంస్థపై ఇలా వ్యవహరించాల్సిన అవసరం ఏముందో అర్ధం కావటంలేదని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఓ వైపు సంక్షేమ కార్యక్రమాల కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెడుతూ..ఏ పేదలు, మధ్య తరగతి ప్రజలకు సేవలు అందిస్తుందో అలాంటి ఆర్టీసీపై ఇంత కఠిన వైఖరికి కారణం ఏమై ఉంటుంది?. అన్నదే అసలు ప్రశ్న.

Next Story
Share it