Telugu Gateway
Politics

ప్రభుత్వంలో ఆర్టీసి విలీనానికి తెలంగాణ కేబినెట్ నో

ప్రభుత్వంలో ఆర్టీసి విలీనానికి తెలంగాణ కేబినెట్ నో
X

తెలంగాణ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయబోమని ముఖ్యమంత్రి కెసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రివర్గంలో తీర్మానం చేశామని వెల్లడించారు. ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితి బాగాలేనందున కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టం కూడా ప్రజారవాణాలో పోటీతత్వం ఉండాలని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరూ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని ఎవరూ కోరలేరని.. ఆ అధికారం కూడా ఎవరికీ ఉండదన్నారు. కొంత మంది బ్లాక్ మెయిల్స్ నిరోధించటానికి రాజ్యం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

అదే సమయంలో ప్రైవేట్ బస్సుల వాళ్ళు కూడా బ్లాక్ మెయిల్ చేస్తారని..అందుకే పూర్తిగా ప్రైవేట్ పరం చేయటంలేదన్నారు. కాదు కూడదు అని కార్మికులు అంతే మొండిపట్టుదలతో ఉండే తెలంగాణ ఆర్టీసీ రహిత రాష్ట్రంగా మారుతుంది..ఏమి అవుతుంది అని ప్రశ్నించారు. పార్లమెంట్ లో కొత్త రవాణా చట్టాన్ని ఆమోదించి వచ్చిన తెలంగాణ బిజెపి ఎంపీలు ఇక్కడకు వచ్చి అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని కెసీఆర్ విమర్శించారు. దీనికి వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ చట్టానికి అనుకూలంగా పార్లమెంట్ లో బిజెపి ఎంపీలు ఓటు వేశారా? లేదా అని నిలదీశారు కెసీఆర్.

Next Story
Share it