Telugu Gateway
Andhra Pradesh

వల్లభనేని వంశీ సస్పెన్షన్..చేతులు కాలాక..!

వల్లభనేని వంశీ సస్పెన్షన్..చేతులు కాలాక..!
X

తెలుగుదేశం పార్టీ తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది. వల్లభనేని వంశీ ఎప్పుడో టీడీపీకీ రాజీనామా చేశారు. రాజీనామా వద్దని చంద్రబాబు రాయభారాలు కూడా నడిపారు మధ్యలో వంశీ తాను వైసీపీలో చేరబోతున్నట్లు మీడియాకు కూడా వెల్లడించారు. ఎప్పుడూ స్పందించని తెలుగుదేశం పార్టీ వల్లభనేని వంశీ ఓ వైపు చంద్రబాబు దీక్ష చేస్తున్న సమయంలో టీడీపీపై, ఆ పార్టీ అగ్రనాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే వరకూ వేచిచూసి..తాపీగా శుక్రవారం నాడు సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. కారణాలు ఏమైనా కూడా వంశీ టీడీపీకి దూరం జరగాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయం టీడీపీ అధిష్టానానికి తెలుసు. అలాంటప్పుడు ముందే సస్పెండ్ చేసి ఉంటే..వంశీ చేసే విమర్శలకు పెద్ద విలువ ఉండేది కూడా కాదు. అలా కాకుండా అంతా అయిపోయిన తర్వాత సస్పెండ్ చేసి సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు మూటకట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. శుక్రవారం నాడు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో సమావేశం అయి వంశీతోపాటు పలు అంశాలను చర్చించారు. పార్టీ అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసినందున వంశీపై సస్పెన్షన్ వేటు పడింది.

టీడీపీ నుంచి వల్లభనేని వంశీని సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. వంశీ ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశాడని.. వైసీపీలోకి వెళ్లేందుకే పార్టీపై దుమ్మెత్తిపోశాడని మెజార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు. దీంతో... పార్టీపై ఉద్దేశపూర్వకంగా ఎవరు ఈ తరహా వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించేది లేదని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో వైసీపీ కండువా కప్పుకుంటే తప్ప.వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అలా ఉంటూనే నిత్యం టీడీపీపై విమర్శలు చేస్తూ ఉన్నా చేయగలిగేది ఏమీ ఉండదు. జగన్‌‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు గురువారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ వెల్లడించారు. 45 సంవత్సరాల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు... అధికారం లేకపోతే ఐదారునెలలు కూడా ఆగలేకపోతున్నారని విమర్శించారు. ఇసుక కోసం దీక్షలు చేయటం సరికాదన్నారు. అకాల వర్షాలు, అతివృష్టి, వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినపుడు కూడా నదుల, కాలువల నుంచి ఇసుకను తీసే టెక్నాలజీని చంద్రబాబు ఏమైనా కనిపెట్టారా అని వంశీ ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం వచ్చినా మంచి పనిచేస్తే సమర్థించాలని, అలాకాకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు మీరు వ్యతిరేకించగానే, మీ వెనుక దూడల్లాగా అనుసరిస్తే అభాసుపాల అవుతామన్నారు. ఇంగ్లీషు మీడియంను సమర్థించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంగ్లీషు వద్దని చెప్పటం లేదు కదా అన్నారు.

Next Story
Share it