Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ‘సింగపూర్ సినిమా’ క్లోజ్

ఏపీలో ‘సింగపూర్ సినిమా’ క్లోజ్
X

ఆంధ్రప్రదేశ్ లో ‘సింగపూర్’ సినిమా ముగిసింది. చంద్రబాబునాయుడి హయాంలో ‘స్టార్టప్ ఏరియా’ పేరుతో ఆ దేశానికి చెందిన ప్రముఖ సంస్థలైన అసెండాస్, సెంబ్ కార్ప్, సింగ్ బ్రిడ్జిలకు అమరావతిలో 1691 ఎకరాలకు కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు సర్కారే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో మౌలికసదుపాయాలు కల్పించాలని నిర్ణయం తీసుకుని ఈ మేరకు జీవో ఇచ్చింది. ఇది జరిగి సంవత్సరాలు అయినా సరే సింగపూర్ కంపెనీలు ప్రాజెక్టును ఏ మాత్రం ముందుకు తీసుకెళ్ళలేదు. ‘స్టార్టప్ ఏరియా’ కింద సింగపూర్ కంపెనీలు చేసే వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది వాణిజ్య సముదాయాలు, భవనాలు నిర్మించి అమ్ముకోవటం. తర్వాత హౌసింగ్ ప్రాజెక్టులతోపాటు ఐటి, ఆర్ధిక రంగాలకు సంబంధించి వివిధ ప్రాజెక్టులకు అవసరమైన స్పేస్ డెవలప్ చేయటం వంటివి ఉన్నాయి. స్విస్ ఛాలెంజ్ విధానంలో ఈ ప్రాజెక్టును చంద్రబాబు సర్కారు సింగపూర్ కంపెనీలకు అప్పగించగా..అది తీవ్ర వివాద్పదం అయిన విషయం తెలిసిందే.

సింగపూర్ సంస్థల కోసం అప్పటి ప్రభుత్వం ఏకంగా చట్టంలో కూడా సవరణలు చేసి మరీ నిర్ణయాలు తీసుకుంది. వేల ఎకరాల భూమి ఇవ్వటంతో పాటు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలికసదుపాయాలు కల్పించటానికి సిద్ధం అయినా కూడా ఈ ప్రాజెక్టులో అధిక వాటా సింగపూర్ సంస్థలకు కట్టబెట్టి..తక్కువ వాటాను ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించారు. ఏపీలో ఎన్నికల అనంతరం జరిగిన అధికార మార్పిడి అనంతరం వైసీపీ సర్కారు ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్ళరాదని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా జీవో కూడా ఇచ్చింది. ఆ వెంటనే సింగపూర్ కంపెనీలు కూడా తాము కూడా ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నామని..అయినా సరే ఏపీతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో తమ కంపెనీల పెట్టుబడులు కొనసాగుతాయని..కొత్త అవకాశాలను అన్వేషిస్తామని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం, సింగపూర్ సంస్థలు పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాయి.

Next Story
Share it