Telugu Gateway
Politics

మహారాష్ట్రలో షాకింగ్ ట్విస్ట్..సీఎంగా ఫడ్నవీస్

మహారాష్ట్రలో షాకింగ్ ట్విస్ట్..సీఎంగా ఫడ్నవీస్
X

‘శరద్ పవార్’ను అర్ధం చేసుకోవాలంటే వంద సంవత్సరాలు కూడా చాలవు.’ ఇవీ శివసేనకు చెందిన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. శుక్రవారం రాత్రి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సీఎం అవుతున్నారని శరద్ పవార్ స్వయంగా ప్రకటించారు. కానీ రాత్రికి రాత్రి పరిణామాలు ఎవరూ ఊహించని రీతిలో మారిపోయాయి. శనివారం ఉదయమే మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అంతే కాదు..ఆయన తోపాటు ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం జరిగిన పరిణామాలు దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాలను షాక్ కు గురిచేశాయి.

ఎవరూ ఊహించని రీతిలో ఈ ట్విస్ట్ రావటంతో శివసేన మైండ్ బ్లాక్ అయినంత పని అయింది. ఎలాగైనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై శివసేనికుడిని కూర్చోపెట్టాలన్న శివసేన ప్రయత్నాలకు ఊహించని షాక్ తగిలింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయటం, వెంటనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం జరిగిపోయింది అంటే ఎంత రహస్యంగా పనికానిచ్చారో అర్ధం అవుతోంది. మహా ట్విస్ట్ వెనక బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, శరద్ పవార్ లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందరూ శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతున్నారని భావించారు. పత్రికల్లో కూడా ఇదే వార్త బ్యానర్లుగా వచ్చింది. పాఠకులు పేపర్ చూసేలోగానే కొత్త ముఖ్యమంత్రి వచ్చేశారు.

Next Story
Share it