సుప్రీం ‘విస్తృత బెంచ్’ కు శబరిమల వివాదం

దేశంలోని ప్రముఖ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు విస్తృత బెంచ్ కు బదలాయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మొత్తం ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఐదుగురిలో ముగ్గురు మాత్రమే విస్తృత ధర్మాసనానికి ఈ అంశాన్ని బదలాయించాలని నిర్ణయించగా..ఇద్దరు వ్యతిరేకించారు. మెజారిటీ నిర్ణయానికి అనుగుణంగా శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన అంశాన్ని విస్తృత బెంచ్ కు నివేదించారు. ఈ సందర్భంగా సీజె రంజన్ గోగోయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశ్వాసం అనేది పౌరుల హక్కు అని వ్యాఖ్యానించారు. అయితే మహిళల ప్రవేశం అనే అంశం ఒక్క శబరిమలకే పరిమితం కాదని..మసీదులతోపాటు మరికొన్ని ప్రార్ధనా మందిరాల అంశం కూడా ఉంటుందనే అంశం చర్చకు వచ్చిందని అన్నారు.
మతంలో అంతర్గత భాగంగా ఉన్న అంశాలపై చర్చ జరపాలని పిటీషనర్లు కోరారన్నారు. విస్తృత బెంచ్ కు ఈ అంశాన్ని నివేదించాలన్న నిర్ణయాన్ని జడ్జీలు నారీమన్, చంద్రచూడ్ లు వ్యతిరేకించారు. దీన్ని సమర్ధించిన వారిలో సీజె రంజన్ గోగోయ్ తోపాటు జె. ఖనీల్వర్, ఇందూ మల్హోత్రాలు ఉన్నారు. అయితే గతంలో అంటే 2018 సుప్రీంకోర్టు శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన అంశంపై స్టే విధిస్తున్నట్లు మాత్రం సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించలేదు. ఈ లెక్కన ఆసక్తి ఉన్న మహిళలు ఎవరైనా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చు.