Telugu Gateway
Politics

తహసీల్దార్ హత్యపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తహసీల్దార్ హత్యపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య జరిగిందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ హత్యకు ప్రత్యక్షంగా..పరోక్షంగా కారణమైన వారందరిపై చర్యలు తీసుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి మంగళవారం నాడు విజయారెడ్డి భౌతికకాయానికి కొత్తపేటలో నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు వస్తున్నాయని విమర్శించారు. రెవెన్యూ అధికారులను ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. విజయారెడ్డి మృతదేహనికి నివాళులు అర్పించేందుకు సీఎం కెసీఆర్, మంత్రులు కెటీఆర్, హరీష్ రావు రాకపోవటం బాధాకరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు.

ఘటనపై ఉద్యోగులు భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తే కాంగ్రెస్‌ పార్టీ వారికి పూర్తి మద్దతు ప్రకటిస్తుందని హామీ ఇచ్చారు. ‘మేజిస్ట్రేట్ అధికారాలు ఉన్న అధికారిణిపై దాడి దారుణం. దాదాపు ఐదు వందల ఎకరాల భూ వివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగింది. ఇంతటి ఘోరమైన ఘటన జరిగితే న్యాయం చేస్తామని ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దగ్గరే ఉంది. హత్య జరిగి 24 గంటలు గడుస్తున్నా సీఎం నివాళులు అర్పించేందుకు రాలేదన్నారు. మొన్న ఆర్టీసీ, నిన్న రెవెన్యూ.. రేపు మరో శాఖకు ఇలాంటి చేదు అనుభవాలు పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.

Next Story
Share it