Telugu Gateway
Andhra Pradesh

ఎల్వీ..ప్రవీణ్ ప్రకాష్ ల మధ్య గొడవకు ఇవే కారణాలు

ఎల్వీ..ప్రవీణ్ ప్రకాష్ ల మధ్య గొడవకు ఇవే కారణాలు
X

వారంలో వివరణ ఇవ్వండి

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, సీఎం కార్యాలయంలోని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ల మధ్య వివాదానికి కారణం ఏమి అయి ఉంటుంది?. సీఎస్ ఏకంగా ఎందుకు ప్రవీణ్ ప్రకాష్ కు మెమో జారీ చేసి వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. నవంబర్ 1న ఈ మెమో జారీ అయింది. ఇందులో సీఎస్ ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. అందులో స్పష్టంగా ప్రవీణ్ ప్రకాష్ బిజినెస్ రూల్స్ తోపాటు కండక్ట్ రూల్స్ ను కూడా ఉల్లంఘించారని పేర్కొన్నారు ఎల్వీ, ప్రవీణ్ ప్రకాష్ ల మధ్య వివాదానికి కారణమైన అంశాలేంటో ఓ లుక్కేద్దాం. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్స్ కు సంబంధించిన ఫైలును మంత్రివర్గం ముందుకు పెట్టేందుకు సాదారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యానికి పంపారు.అయితే సీఎస్ ఈ ఫైలును వెనక్కి పంపి బిజినెస్ రూల్స్ ప్రకారం ఆర్ధిక శాఖ అనుమతి తీసుకోవటంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అందరి నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. ఏపీ బిజినెస్ రూల్స్ లోని నిబంధన 7(2) ప్రకారం రీ సర్కులేట్ చేయాలని సూచించారు.

కానీ ఇవేమీ పట్టించుకోకుండా ప్రవీణ్ ప్రకాష్ చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి ఆమోదం లేకుండా ఈ ప్రతిపాదనను కేబినెట్ ముందు పెట్టారు. మరో కేసు గ్రామ న్యాయాలయాలకు సంబంధించింది. గ్రామ న్యాయాలయాలకు సంబంధించిన ఫైలును సంబంధిత శాఖ మంత్రివర్గంలో ప్రతిపాదన పెట్టేందుకు వీలుగా ముఖ్యమంత్రి వరకూ అనుమతులు పొందింది. అయితే ఆ శాఖ కార్యదర్శి కోరినా కూడా ప్రతిపాదిత ఫైలును కేబినెట్ ముందు పెట్టడంలో జీఎడీ ముఖ్య కార్యదదర్శి ప్రవీణ్ ప్రకాష్ విఫలమయ్యారు. ముఖ్యమంత్రి అనుమతి తర్వాత కూడా ఏ కారణంతో అయినా సరే సీఎం ముఖ్య కార్యదర్శి, జీఎడీ ముఖ్య కార్యదర్శి తన దగ్గర ఫైలు పెట్టుకునే అధికారంలేదని ప్రవీణ్ ప్రకాష్ కు ఇచ్చిన మెమోలో ఎల్వీ పేర్కొన్నారు.ఒక వేళ సీఎంవో నుంచి మౌఖిక ఆదేశాలు అందినా కూడా ప్రవీణ్ ప్రకాష్ ఆ విషయాన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సెక్రటరీ అయిన చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

కానీ ప్రవీణ్ ప్రకాష్ ఈ పద్దతిని పాటించలేదన్నారు. మంత్రివర్గం ముందు ప్రతిపాదనలకు సంబంధించిన ఫైల్స్ నిర్వహణలో ప్రవీణ్ ప్రకాష్ నిబంధనలను దారుణంగా ఉల్లంఘించారని తెలిపారు. అంతే కాకుండా ఈ విషయంలో సాదారణ పరిపాలన శాఖ ముఖ్య కారదర్శి ప్రవీణ్ ప్రకాష్ దుష్ప్రవర్తనతో వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తే సదరు అధికారి ఉద్దేశపూర్వకంగా బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘించటంతోపాటు తన పై అధికారులను అగౌరపర్చేలా వ్యవహరించారన్నారు. దీని ద్వారా సీనియర్ అధికారి అయిన ప్రవీణ్ ప్రకాష్ ఏఐఎస్(కండక్ట్) రూల్స్ 1968 ఉల్లంఘించారని ఎల్వీ సుబ్రమణ్యం తన మెమోలో పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని బిజినెస్ రూల్స్, కండక్ట్ రూల్స్ ఉల్లంఘించినందుకు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Next Story
Share it