Telugu Gateway
Telangana

ఆర్టీసి సమ్మె..ఎమ్మెల్యేల ఇళ్ళ ముందు నిరసనలు

ఆర్టీసి సమ్మె..ఎమ్మెల్యేల ఇళ్ళ ముందు నిరసనలు
X

ఆర్టీసి సమ్మె ఉద్యమం కొత్త రూపు సంతరించుకుంటోంది. సోమవారం నాడు ఈ అంశంపై హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. ప్రభుత్వం కార్మికులతో ఓ సారి చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. కానీ సీఎం కెసీఆర్ మాత్రం కోర్టు ఏమి చెబుతుందో చూసి తర్వాత ముందడుగు వేద్దామనే ధోరణితో ఉన్నట్లు కన్పిస్తోందని చెబుతున్నారు. ఛలో ట్యాంక్ బండ్ నిరసనతో పాటు భవిష్యత్ లో చేపట్టాల్సిన చర్యలపై ఆర్టీసీ జెఏసీ నేతలు, అఖిలపక్ష నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం నాడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాల ముందు ధర్నాలు చేయాలని నిర్ణయించారు. మంగళవారం నాడు మాత్రం జెఏసీ నేతలు అమరణ నిరాహారదీక్షకు దిగనున్నారు.

నలుగురు జేఏసీ నేతలు తొలివిడత నిరవధిక నిరాహార దీక్షలో కూర్చునబోతున్నారు. ‘18న జైల్‌భరో కార్యక్రమం నిర్వహిస్తాం. మా దీక్షకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని కోరుతున్నాం. కోర్టు సూచన మేరకు వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలి. హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియకుండానే.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం కేసీఆర్ అనడం సమంజసం కాదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి చర్చలు జరిపేలా కృషి చేయాలి. నిన్న కేవలం ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు మాత్రమే ‘చలో ట్యాంక్‌బండ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు.. మావోయిస్టులు పాల్గొన్నారని పోలీసులు తప్పుగా అపాదించవద్దు" అని జెఏసీ నేత అశ్వత్థామరెడ్డి కోరారు.

Next Story
Share it