Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు..జగన్ ల మధ్య నలుగుతున్న‘అమరావతి’

చంద్రబాబు..జగన్ ల మధ్య నలుగుతున్న‘అమరావతి’
X

అమరావతి. ఏపీ రాజకీయాలకు కేంద్ర బిందువు అయిన ప్రాంతం. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అమరావతిపై విపరీతమైన ‘హైప్’ క్రియేట్ చేశారు. అద్భుతాలు సృష్టించబోతున్నాం..సింగపూర్..ఆస్థానా..జపాన్ ఇలా ఎన్నో దేశాల పేర్లు చెప్పారు. ఆ దేశాల తరహాలో అమరావతి కూడా అభివృద్ధి చేయబోతున్నామని భ్రమలు కల్పించారు. రాజధానికి సంబంధించి చంద్రబాబు హయాంలో చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా 33000 వేల ఎకరాలు సేకరించటం. ఇందులోనూ బెదిరింపులు..బలవంతాలు ఉన్నాయనే విమర్శలూ ఉన్నాయి. చంద్రబాబు క్రియేట్ చేసిన హైప్ తో అమరావతి ప్రాంతంలో ఎకరం ధర గరిష్టంగా నాలుగు కోట్ల రూపాయల వరకూ వెళ్ళింది. ఇది ఒకెత్తు అయితే చంద్రబాబునాయుడు తన పాలనలో కనీసం శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హెచ్ వోడీ భవనాల నిర్మాణాలు పూర్తి చేసి ఉంటే అసలు ఇప్పుడు ఈ రచ్చే ఉండేది కాదు. ఈ విషయంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి.

అప్రతిహత మెజారిటీతో జగన్ ఎంట్రీ. చంద్రబాబు హైప్ క్రియేట్ చేసిన అమరావతిపై జగన్ మొదటి నుంచి నీళ్ళు చల్లుతూనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండగా మాత్రం రాజధాని అమరావతిలోనే ఉంటుందని సాక్ష్యాత్తూ వైసీపీ ప్లీనరీ నుంచే సంకేతాలు ఇఛ్చారు జగన్. సీఎం జగన్ కు అప్పుడు తెలియదా? అమరావతిలోని భూముల్లో నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని?.తెలియకుండానే అప్పుడు ఓకే చెప్పారా?. లేక అలా చెప్పకపోతే రాజకీయంగా నష్టం అని చెప్పారా?. ఇది ఒకెత్తు అయితే జగన్ ఇఫ్పుడు భూముల అమ్మకం ద్వారా ‘బిల్డ్ ఏపీ’ అంటున్నారు. మరి అదే లాజిక్ ను ఇక్కడ అమరావతిలో ఎందుకు వర్తింపచేయరు?. అమరావతిలో సేకరించిన 33 వేల ఎకరాల్లో నికరంగా వాడుకోవటానికి ఏకంగా పది వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంటుంది.

ఆ పది వేల ఎకరాల్లో తొలి దశలో 2500 ఎకరాలను ఎకరా 4 కోట్ల రూపాయల లెక్కన అమ్మినా ఏకంగా పది వేల కోట్ల రూపాయలు వస్తుంది. ఆ భూములు అమ్మిన డబ్బుతోనే రాజధాని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అక్కడ లావాదేవీలు పెరిగితే మిగిలిన భూమికి కూడా మరింత విలువ వచ్చేది. అలా దశల వారీగా రైతులు ఇఛ్చిన భూమిని అమ్ముకుంటూనే అమరావతిని పూర్తి చేసే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ పాఠశాలలు, ఆస్పత్రులకు సంబంధించి చెబుతున్నట్లు ‘నాడు-నేడు’ అని ఫోటోలు ప్రదర్శించవచ్చు కదా?. అయినా జగన్ హయాంలో శాశ్వత రాజధాని నిర్మాణాలు జరిగితే...అమరావతి చంద్రబాబే కట్టారని ప్రజలు అంటారా?.

అయినా రాష్ట్రం..రాజధానులు ఏ ఒక్క ముఖ్యమంత్రో..ఇద్దరు ముఖ్యమంత్రులో నిర్మించేవి కాదు కదా?. కానీ ఎవరికి వారు తమ ప్రయోజనాల కోసం రైతులు ఇచ్చిన భూములతో ‘రాజకీయ క్రీడ’ ఆడుకుంటున్నారని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉండగా అమరావతికి అనుకూలంగా మాట్లాడారు జగన్. కానీ మునిసపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం ఇఫ్పుడు కమిటీ నివేదిక వచ్చాకే రాజధాని ఎక్కడో తేలుస్తామని చెబుతున్నారు. అధికారంలో ఉన్నంత కాలం డిజైన్లతో కాలక్షేపం చేసి ఇఫ్పుడు శంకుస్థాపన ప్రాంతంలో చంద్రబాబు భూమిని ముద్దాడటం వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది?. ఏదో సెంటిమెంట్ రాజేయాలనే ప్రయత్నం తప్ప.

Next Story
Share it