Telugu Gateway
Politics

వైసీపీ సర్కారుకు పవన్ కళ్యాణ్ డెడ్ లైన్

వైసీపీ సర్కారుకు పవన్ కళ్యాణ్ డెడ్ లైన్
X

ఎన్నికల తర్వాత జనసేన చేసిన ‘తొలి మార్చ్’ ఇది. ప్రస్తుతం ఏపీలో లక్షలాది మందిని కుదిపేస్తున్న ఇసుక సమస్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు భారీ జనసందోహం మధ్య ‘లాంగ్ మార్చ్’ నిర్వహించారు. దీనికి టీడీపీ బహిరంగ మద్దతు ప్రకటించింది. మద్దతు ప్రకటించటమే కాదు.ఆ పార్టీ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొని పవన్ కళ్యాణ్ తో వేదిక కూడా పంచుకున్నారు. బిజెపి కూడా సంఘీభావం తెలిపింది. వామపక్షాలు ఓ విచిత్రవాదనతో దీనికి దూరం ఉండి..సమస్యకు సంఘీబావం అంటూ ప్రకటించాయి. ఇసుక సమస్యను రెండు నెలల్లో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. లేకపోతే అమరావతి వీధుల్లో కూడా పోరాటం చేస్తానని సర్కారును హెచ్చరించారు. ఇసుక లేక ఉఫాధి కోల్పోయిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికీ రూ.50 వేలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు. మంత్రుల జేబుల్లోంచి ఇవ్వక్కర లేదు... భవన నిర్మాణ కార్మికుల నిధి నుంచి ప్రభుత్వం తీసుకున్నది రూ.1200 కోట్లు ఉంది.

అందులోంచి కార్మికులకు ఇవ్వండి అని వ్యాఖ్యానించారు. 36 మంది కార్మికులు చనిపోయారు... వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి అని స్పష్టం చేశారు. భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేయటం కూడా కష్టం కావటంతో వాహనంలో ఆయన సమావేశ వేదిక వద్దకు వెళ్ళాల్సి వచ్చింది. “ప్రజల కష్టాలను అర్థం చేసుకోవాలి. అది నా బాధ్యతగా భావిస్తాను. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకు వస్తున్నారు. అంటే ప్రభుత్వం విఫలమైందనే అర్థం. భవన నిర్మాణ కార్మికుల్లో ఎంత ఆవేదన ఉందో రోడ్డు మీదకు వచ్చిన వారిని చూస్తే తెలుస్తుంది. ఇలా ఎందుకు వస్తున్నారో ఆలోచించాలి. ఇప్పటి వరకూ 36 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఇంతమంది చనిపోవడం నాకు చాలా ఆవేదన కలిగించింది, ప్రభుత్వాలు ప్రాణాలు రక్షించాలి తప్ప ప్రాణాలు తీయకూడదు. పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ఒక కార్మికుడు సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి చనిపోయాడు, అంతకంటే దౌర్బాగ్యం ఏమైనా ఉంటుందా? ప్రజల ఆవేదనే నన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది. సిఎం జగన్ అద్భుతంగా పాలన చేసి ఉంటే ఇలాంటి నిరసనలు తెలియచేయం కదా.’ అని వ్యాఖ్యానించారు.

ఇసుకను అందుబాటులోకి తీసుకురాకపోవడం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది. పాలనలో అనుభవం లేదు కాబట్టే వైసీపీ వాళ్ళు ఇసుకే కదా అని తేలిగ్గా మాట్లాడుతున్నారు. నిర్మాణ రంగం ఆగిపోతే అభివృద్ధి ఆగిపోతుంది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు సాగుతుంటాయి. పాఠశాలలో చిన్న క్లాస్ రూమ్ అదనంగా కట్టాలి అన్నా వివిధ విభాగాల కార్మికులు పని చేయాల్సి ఉంటుంది. నిర్మాణానికి అవసరమైన ఇసుకను దూరం చేస్తే అన్ని విభాగాలకీ పని లేకుండాపోతుంది. అందుకు అనుగుణంగానే అభివృద్ధి ఆగుతుంది. ఈ రంగం కుదేలైపోయి ఉంది. భవన నిర్మాణ కార్మికుల కష్టాలు, ఆవేదన నా మనసును బలంగా తాకాయి. నేను కష్టించే వాడిని, కష్టాన్ని అర్థం చేసుకునే వాడిని, అందుకే నేను నా జీవితం నేను చూసుకోలేక రాజకీయాల్లోకి వచ్చాను. కార్మికుల కష్టాలు బాధలు అర్థం చేసుకున్నవాడిని అని పేర్కొన్నారు. వర్షాలు..వరదల వల్ల ఇసుక లేదని చెప్పటం కుంటిసాకు అని ఆరోపించారు. చంద్రబాబు నాయుడి మీద కోపంతో లక్షల మంది కార్మికులను రోడ్డు పాల్జేయడం సమంజసమా? టీడీపీ ప్రభుత్వం ఇసుక విధానంలో తప్పొప్పులు ఉంటే సరిచేసి ముందుకు వెళ్ళాలి. అంతేతప్ప మొత్తం ఆపేస్తాం అంటే ఎలా? 15 రోజుల్లో ఇసుక పాలసీ అని చెప్పి, 45 రోజులైనా దానిపై మాట్లాడలేదు, చర్చలు జరగలేదు, అలా చేస్తూ సెప్టెంబర్ వరకు తీసుకొచ్చారు, ఇప్పుడు వర్షాలు, వరదలు అని అంటారు. వైసీపీలో ప్రజాస్వామ్యం లేదు. అక్కడ ఉన్నది ఏకస్వామ్యమే. జగన్ ప్రభుత్వంలో డిబేట్లు లేవు. ఆలోచనలు పంచుకోరు. పాలన ఇష్టానుసారం చేసుకుంటూపోతున్నారు.

రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు నాపై చంద్రబాబు దత్తపుత్రుడు, డి.ఎన్.ఏ., బీ టీం అని మాట్లాడుతున్నారు. నేను చంద్రబాబు గారి దత్తపుత్రుడిని కాదు. కష్టాల్లో ఉన్న ప్రజలకే నేను దత్తపుత్రుడిని. సూట్‌కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంబేద్కర్, కాన్షీరామ్ లాంటి మహామహులే ఓడిపోయారు. వారి స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నా. ఓడిపోవచ్చేమోగానీ నాలో చిత్తశుద్ధిలో నిబద్ధత ఉంది. రెండున్నరేళ్లు జైళ్లో ఉన్న నాయకులు కూడా విమర్శిస్తున్నారు. స్వతంత్ర్య పోరాట నాయకుడిలా, లేదా పౌరహక్కులను కాపాడే నాయకుడిలా జైలుకెళ్లలేదు. సూట్‌కేసు కంపెనీలు పెట్టి జైలుకెళ్లారు. మంత్రి కన్నబాబు ఎలా వచ్చాడో తెలుసు. నాగబాబు తీసుకువస్తే రాజకీయా ల్లోకి వచ్చాడు. వాళ్ళ బతుకులు తెలుసు. కూల్చివేతలతో మొదలుపెట్టిన ప్రభుత్వం కూలిపోతుంది. ఇది కర్మ సిద్ధాంతం కాదు..చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ప్రజల్ని మీరు ఎలా చూస్తారో.. వాళ్లు మిమ్మల్ని అలానే చూస్తారు. 151 సీట్లు వచ్చిన నాయకులు కూడా దీనికి అతీతులు కాదు. ప్రతి శుక్రవారం కోర్టులకు వెళ్లే మీరు జనాలను పాలిస్తారా? వాళ్ళకు ఆ అర్హత ఉందా? ఒక సమస్యపై అన్ని పక్షాలు కలసి రావాలి అనే రాజకీయ పార్టీలు అన్నింటినీ ఆహ్వానించామని తెలిపారు.

Next Story
Share it