Telugu Gateway
Politics

ఎన్డీయేకు శివసేన షాక్..కేంద్ర మంత్రి రాజీనామా

ఎన్డీయేకు శివసేన షాక్..కేంద్ర మంత్రి రాజీనామా
X

మహారాష్ట్ర రాజకీయాలు ఎన్నో కొత్త మలుపులకు కారణం అవుతున్నాయి. శివసేన ఏకంగా ఎన్డీయేకు గుడ్ బై చెప్పింది. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న శివసేన కు చెందిన అరవింద్ సావంత్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్రలో శివసేన సర్కారు ఏర్పాటు దిశగా వేగంగా పావులు కదుపుతున్నట్లు స్పష్టం అవుతోంది. శివసేనకు మద్దతు ఇవ్వాలంటే ఎన్డీయే నుంచి బయటకు రావాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఓ షరతు పెట్టారు. ఇందుకు అంగీకరించటమే కాకుండా...శివసేన సత్వరమే తన నిర్ణయాన్ని అమలు చేసింది. దేశంలో బిజెపి గతంలో ఎన్నడూలేనంత శక్తివంతంగా ఉన్న సమయంలో మిత్రపక్షంగా ఉన్న శివసేన బిజెపిపై తిరుగుబాటు జెండా ఎగరేయటం అన్నది అత్యంత కీలక పరిణామంగా మారింది. తాజా పరిణామాలు మహారాష్ట్రలో ఎన్ని సంచలన మార్పులకు కారణం అవుతాయో వేచిచూడాల్సిందే. బీజేపీతో ఏర్పడిన విభేదాలతో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు. ‘తామెందుకు ఇంకా ఢిల్లీలో ఉండాలి. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి.. మోదీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నా’ అంటూ సోమవారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ హుటాహుటిన ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు, పలువురు సీనియర్లతో చర్చించారు. చివరికి వారి అంగీకారంతోనే పదవులకు రాజీనామా చేస్తున్నారు. అలాగే తాము ఎన్డీయే కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు త్వరలోనే శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే ప్రకటిస్తారని సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు విముఖత చూపింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ బీజేపీని శనివారం గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ వెనకడుగు వేయడంతో కొత్త రాజకీయ సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. సీఎం పదవి విషయంలో శివసేనతో అంతరం పెరిగిపోవడం, ప్రభుత్వం ఏర్పాటుకు చాలినంత బలం కూడగట్టలేక బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకే మొగ్గు చూపింది. బిజెపి నో చెప్పటంతో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్‌ ఆహ్వానం పంపారు. ఈ విషయంలో అభిప్రాయం తెలపాలంటూ సోమవారం సాయంత్రం 7.30 గంటల వరకు గవర్నర్‌ ఆ పార్టీ శాసనసభా నేత ఏక్‌నాథ్‌ షిండేకు గడువిచ్చారు. ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్లో మకాం వేసిన శివసేన ఎమ్మెల్యేలంతా గవర్నర్‌ ఆహ్వానం అనంతరం పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం మాతోశ్రీకి తరలివెళ్లారు. సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ ఈ కూటమికి మద్దతు ఇస్తుందా? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Next Story
Share it