Telugu Gateway
Politics

ఉద్ధవ్..ఆదిత్య ఠాక్రేల రికార్డు

ఉద్ధవ్..ఆదిత్య ఠాక్రేల రికార్డు
X

మహారాష్ట్ర అసెంబ్లీ ఈ సారి ఎన్నో రికార్డులకు కేంద్రం కానుంది. తొలిసారి ముఖ్యమంత్రి లేకుండా సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఎప్పుడైనా సీఎం ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత తొలుత సీఎం సభలో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిగిలిన సభ్యులందరూ చేస్తారు. కానీ ఈ సారి అందుకు భిన్నంగా జరిగింది. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీలో మరో రికార్డు నమోదు కానుంది. తండ్రి సీఎం..కొడుకు ఎమ్మెల్యేగా ఉండబోతున్నారు. ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఆయన తనయుడు ఇదే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అసలు ఠాక్రే ఫ్యామిలీ నుంచి చట్టసభకు ఎన్నిక కావటం కూడా ఇదే మొదటి సారి.

ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఆరు నెలల్లో ఆయన శాసనమండలి లేదా, శాసనసభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక తర్వాత రాష్ట్ర శాసనసభలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. మహారాష్ట్ర రాజకీయ చరిత్రకు సంబంధించినంత వరకు ఇలాంటి రికార్డు నమోదుకావడం ఇదే తొలిసారి. ‘రాష్ట్ర అసెంబ్లీలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా ఉండటం ఇదే తొలిసారి. ఇది అరుదైన రికార్డుగా చెప్పవచ్చు’ అని మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ కార్యదర్శి అనంత్‌ కల్సే వ్యాఖ్యానించారు. ఉద్ధవ్‌ ఠాక్రే తండ్రి బాలాసాహెబ్‌ ఠాక్రే, సోదరుడు రాజ్‌ ఠాక్రే ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఠాక్రేల కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వ్యక్తి ఆదిత్యఠాక్రే. ఠాక్రేల కుటుంబం నుంచి తొలిసారి ఉద్ధవ్‌ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు.

Next Story
Share it