Telugu Gateway
Politics

కర్ణాటక ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన

కర్ణాటక ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన
X

అత్యంత కీలకమైన కర్ణాటక ఉప ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలకు సంబంధించిన 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5న పోలింగ్‌ జరగనుంది. ఫలితాలు డిసెంబర్‌ 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్న కారణంతో గత ప్రభుత్వంలో స్పీకర్‌ వారిపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. దీనిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో ఉప ఎన్నికలు అనివార్యం అయిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో సోమవారం నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ గడువు ముగిసే వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

దీంతో 15 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. స్పీకర్‌ నిర్ణయాన్ని కోర్టు కొట్టివేస్తుందా? లేక సమర్థిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. నవంబర్ 13న సుప్రీంకోర్టు ఈ అంశంపై తీర్పు వెలువరించనుంది. ఎన్నికలు జరిగే స్థానాల్లో గెలుపు అధికార బీజేపీకి పెద్ద సవాలుగా మారనుంది. ఎలాగైనా మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని యడియూరప్ప సర్కార్‌ భావిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Next Story
Share it