Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ పై కన్నబాబు ఫైర్

పవన్ కళ్యాణ్ పై కన్నబాబు ఫైర్
X

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తాను మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని..ఎమ్మెల్యే అయ్యానని కూడా బహిరంగంగా చెప్పానని తెలిపారు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా చిరంజీవి వల్లే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారా? అని ప్రశ్నించారు. సినిమాలు వదిలేసినా కూడా పవన్ కళ్యాణ్ ఇంకా నటన వదిలినట్లు లేదని ఎద్దేవా చేశారు. ఇసుక సమస్యను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ గుంటనక్కలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడల్లా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బయటకు వస్తారని విమర్శలు గుప్పించారు. కన్నబాబు మంగళవారం నాడు కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ‘విశాఖలో లాంగ్‌ మార్చ్‌ పేరుతో పవన్‌ షో చేశారు. ఒక్క అడుగు కూడా నడవకుండా వాహనంపై ఊరేగారు. పక్కన టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడికి పెట్టుకుని మాట్లాడారు. ఇసుక దోపిడి చేసిన వారికి పక్కన పెట్టుకుని మాట్లాడారు.

అక్కడున్న నాయకులంతా గతంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించిన వారే. అయ్యన్నపాత్రుడు కుమారుడు చిరంజీవిపై ఎన్నో విమర్శలు చేశారు. ఇసుక సమస్య మరో 15 రోజుల్లో పరిష్కారం కానుంది. ఈ విషయం తెలిసి కూడా డ్రామాలు ఆడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం 5 నెలలే అయింది. కానీ నెల తిరగక ముందు నుంచే చంద్రబాబు, ఆయన పార్టనర్‌ పవన్‌ ప్రభుత్వాన్ని తిట్టడం మొదలు పెట్టారు. జగన్ 151 స్థానాలు, 22 ఎంపీ సీట్లు గెల్చినా ఎంత ఒదిగి ఉంటున్నారో చూడండి. ప్రభుత్వంలో తప్పులు ఉంటే చెప్పండి. పవన్‌ కల్యాణ్‌ 2 లక్షల పుస్తకాలు చదివానంటున్నారు. వాటిలో ఎక్కడైనా వరదల్లో ఇసుక ఎలా తీయాలని ఉంటే చెప్పండి. వెంటనే ప్రయత్నిస్తాము. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తేనే ఈ విధంగా వ్యవహరిస్తే ఎలా? అని ప్రశ్నించారు.

Next Story
Share it