Telugu Gateway
Telangana

ఆర్టీసీ సమ్మెపై వెనక్కి తగ్గని జెఏసీ

ఆర్టీసీ సమ్మెపై వెనక్కి తగ్గని జెఏసీ
X

ఆర్టీసీ సమ్మెకు ఎప్పుడు ముగింపు పడుతుందో తెలియని పరిస్థితి. సోమవారం నాడు హైకోర్టు తీర్పుతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ముగింపు పలుకుతారని..అంతకు మించిన మరో మార్గం లేదని అందరూ భావించారు. అయితే దీనికి భిన్నంగా సమ్మెతో ముందుకెళ్ళాలనే ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. మంగళవారం నాడు జరిగిన జెఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కోర్టు తీర్పు కాపీ తమకు ఇంత వరకూ అందలేదని..అద అందేవరకూ సమ్మె కొనసాగుతుందని..తర్వాత న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జెఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కార్మికులు అందరూ జెఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారన్నారు. ఇన్ని రోజుల సమ్మె తర్వాత కూడా ఎలాంటి ప్రయోజనం అంటే..ఒక్కటంటే ఒక్క డిమాండ్ కూడా నెరవేరకుండా సమ్మె విరమిస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని ఎక్కువ మంది కార్మికులు అభిప్రాయపడినట్లు జెఏసీ నేతలు చెబుతున్నారు. వారి డిమాండ్ కు అనుగుణంగానే జెఏసీ కూడా సమ్మెతోనే ముందుకు సాగాలని నిర్ణయించినట్లు కనపడుతోంది.

లేబర్ కమిషనర్ రెండు వారాల్లో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సమ్మె కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది. ఎల్బీనగర్‌ హిమగిరి ఫంక్షన్ హాల్‌లో జేఏసీ నేతలు భేటీ అయ్యారు. 46 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం వైఖరిపై కూడా చర్చించారు. సమ్మె విరమణ విషయంలో కార్మికుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం.

ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేవని, ఇంకా సమ్మె కొనసాగిస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయని, లేబర్ కోర్టులో ఈ అంశం తేలడానికి చాలా సమయం పడుతుందని కొంతమంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. మరికొంతమంది ఎన్ని రోజులైనా ప్రభుత్వం దిగొచ్చేవరకు సమ్మె కొనసాగించాల్సిందేనని పట్టుబట్టినట్టు సమాచారం. ఉన్నపళంగా సమ్మె విరమిస్తే ఉద్యోగ భద్రత ఏమిటని కార్మికులు నేతలను ప్రశ్నించినట్టు సమాచారం. సమ్మెను విరమిస్తే ప్రభుత్వం ఉద్యోగంలోకి తీసుకుంటుందో లేదా అన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. కనీసం లేబర్‌ కోర్టులో తేలేవరకైనా సమ్మె కొనసాగించాలని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. జెఏసీ సమావేశం అనంతరం సమ్మె కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.

Next Story
Share it