Telugu Gateway
Telangana

ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధం అని చెప్పలేం

ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధం అని చెప్పలేం
X

హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు సోమవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమ్మెను చట్టవిరుద్ధం అని ప్రకటించలేమని తేల్చింది. ఆర్టీసీ సమ్మెపై సోమవారం వాదనలను కొనసాగించిన కోర్టు పలు అంశాలను ప్రస్తావించింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయని పేర్కొంది. ఇఫ్పటికే చర్చలు జరపాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని, సర్కారును పలుమార్లు కోరామని తెలిపింది. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమంటూ ఓ పిటిషనర్‌ తరఫు న్యాయవాది కృష్ణయ్య హైకోర్టులో వాదనలు వినిపించారు. ఆర్టీసీని పబ్లిక్‌ యూటిలిటీ సర్వీస్‌గా ప్రకటించినందున అత్యవసర సేవల (ఎస్మా) పరిధిలోకి వస్తుందని కృష్ణయ్య పేర్కొన్నారు. కాబట్టి ఆర్టీసీ సమ్మెపై ఎస్మా ప్రయోగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. అత్యవసర సేవలు నిలిచిపోయినప్పుడు మాత్రమే ఎస్మా ప్రయోగించడానికి వీలుంటుందని, ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధంగా చెప్పలేమని హైకోర్టు పేర్కొంది.

ప్రజాప్రయోజనాల పేరిట ఆధారాలు లేకుండా విచిత్రమైన అంశాలను కోర్టు ముందుకు తీసుకొస్తే.. రిలీఫ్‌ ఇవ్వలేమని, ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. రాష్ట్రంలోని పలు రూట్లను ప్రవైటీకరిస్తూ రాష్ట్ర మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని విచారణ సందర్భంగా ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. కోర్టు కోరినట్లు సర్కారు 47 కోట్ల రూపాయలు విడుదల చేసినా కూడా ఆర్టీసీ సమస్యలు పరిష్కారం కావని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆర్టీసీకి ఇప్పుడు అత్యవసరంగా చెల్లించాల్సిన మొత్తాలు 2209 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం అని ప్రకటిస్తోంది. కోర్టు అందుకు భిన్నమైన వాదన తీసుకోవటంతో కార్మికులకు పెద్ద ఊరట దక్కినట్లే భావించవచ్చు. అయితే ఇలాగే చేయమని ఈ అంశంలో ఎవరినీ ఆదేశించలేమని కోర్టు వ్యాఖ్యానించింది.

Next Story
Share it