Telugu Gateway
Telangana

ఆర్టీసీనే సర్కారుకు బాకీ..ఇదీ అఫిడవిట్ల సమాచారం!

ఆర్టీసీనే సర్కారుకు బాకీ..ఇదీ అఫిడవిట్ల సమాచారం!
X

అందరి చూపు హైకోర్టు వైపే. గురువారం నాడు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది?. ఇప్పటికే సమ్మె 30 రోజులు దాటింది. అటు సర్కారు ఏ మాత్రం తగ్గటం లేదు. ఆర్టీసి కార్మికులు కూడా చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తే తప్ప సమ్మె విరమణకు ససేమిరా అంటున్నాయి. బకాయిలపై ఆర్టీసి కార్మిక సంఘాల వాదనకు..సర్కారు వాదనల మధ్య అసలు ‘లెక్క’ కుదరటం లేదు. అసెంబ్లీలో రవాణా శాఖ మంత్రి ఒకటి చెప్పారు..కోర్టుకు మరో సమాచారం ఇచ్చారని యూనియన్ల తరపు లాయర్లు కోర్టుకు నివేదించారు. ఈ తేడాలను హైకోర్టు కూడా గుర్తించింది. అందుకే గురువారం నాటి విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఆర్టీసీ ఇన్ ఛార్జి ఎండీ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్ లు కూడా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. అదే సమయంలో ఒక రోజు ముందు కోర్టు ముందు అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించింది. ఇందులో ఉన్నతాధికారులు ఇచ్చిన లెక్కలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఆర్టీసికి అసలు సర్కారు రూపాయి కూడా బాకీ లేదని..పైగా రివర్స్ లో ఆర్టీసీనే సర్కారుకు బాకీ ఉందని తేల్చారు.

మరి దీనిపై కార్మిక సంఘాల వాదన ఎలా ఉంటుందో..కోర్టు ఏమి ఆదేశాలు జారీ చేస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి కెసీఆర్ బుధవారం నాడు ఆర్టీసి అంశంపై సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. హైకోర్టులో విచారణ, ప్రైవేట్ కు లైన్ క్లియర్ చేయటం తదితర అంశాలపై చర్చించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు అఫిడవిట్లు సమర్పించారు. అందులో ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయి లేదని కోర్టుకు అధికారులు స్పష్టం చేశారు. ఆర్టీసీకి రూ.3,006 కోట్ల అప్పులు ఉంటే ప్రభుత్వం రూ.3,903 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. మోటారు వాహనాల పన్ను కింద ప్రభుత్వానికి ఆర్టీసీనే రూ.540 కోట్లు ఇవ్వాలని అఫిడవిట్‌‌లో వెల్లడించారు. మరిన్ని నిధులు రాబట్టాలనే ఉద్దేశంతో.. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి నిధులు రావాలంటూ మంత్రికి తెలియజేసినట్లు తెలిపారు. రుణం పద్దు కింద విడుదల చేసినవాటికి ప్రభుత్వం ఎప్పుడూ వడ్డీ అడగలేదన్నారు. జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి బట్టే ఆర్టీసీకి సాయం చేసిందన్నారు. ఇప్పుడు ఆర్టీసీకి చెల్లించే స్థితిలో జీహెచ్‌ఎంసీ లేదని అఫిడవిట్లలో అధికారులు వివరించారు.

Next Story
Share it