Telugu Gateway
Telangana

సర్కారు నిర్ణయం వల్లే ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది..హైకోర్టు

సర్కారు నిర్ణయం వల్లే ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది..హైకోర్టు
X

ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో విచారణ ‘సాగుతూనే’ ఉంది. ఈ అంశంపై విచారణ మరోసారి నవంబర్ 11కి వాయిదా పడింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం వలనే సమ్మె కొనసాగుతోంది. దీనితో ప్రజలు 34 రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ​వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్ట్ లు కట్టే ప్రభుత్వం.. సమస్యలో ఉన్న ప్రజలకు 47 కోట్లు ఇవ్వలేరా? ​ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ​ ప్రజల కోసం ప్రభుత్వం తన స్టాండ్ మార్చుకోలేదా? ​ఆర్టీసీ విభజన జరగకుండా ప్రభుత్వం ఎలా నోటిఫికేషన్ ఇస్తుంది. ​ ప్రభుత్వానికి సమస్యను పరిష్కరించే ఉద్దేశం ఉందా లేదా?’ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ నెల 11 వ తారీఖు లోపు కార్మికులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోర్టు సూచించింది. ప్రభుత్వానికి అధికారం ఉన్నట్లే కోర్టులకు కూడా అధికారాలు ఉంటాయని విస్మరించొద్దని వ్యాఖ్యానించింది. సమస్య పరిష్కరించక పోతే తామే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అంతకు ముందు కోర్టు మరోసారి ఐఏఎస్ అధికారులు కోర్టుకు సమర్పించిన లెక్కలపై తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీసీ ఎండీ... ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి చెబుతున్న అంకెలు వేర్వేరుగా ఉన్నాయి... మేం వీటిని పరిగణనలోకి తీసుకోవాలా అని హైకోర్టు ప్రశ్నించింది. 2014 జూన్ నుండి అక్టోబర్ 2019 వరకు ఉన్న మొత్తం లెక్కలను మీకు అందించిన తాజా నివేదిక లో పొందుపరిచామని తెలిపారు. కాగ్ నివేదిక అనుగుణంగా తయారు చేసిన పూర్తి వివరాలతో మీకు అందించామన్నారు.కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు.. పదాలు వాడారని కోర్టు అభిప్రాయపడింది.

రుణ పద్దుల కింద కేటాయించిన నిధులు అప్పు కాదని, గ్రాంటు అని తెలివిగా చెబుతున్నారని పేర్కొంది. ఇంతవరకు ఏ బడ్జెట్ లో అలా చూడలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. మంత్రికి కూడా ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తప్పుడు లెక్కలు ఇచ్చారని, మంత్రికి తప్పుడు లెక్కలు ఇస్తే ప్రభుత్వాన్ని మోసం చేసినట్లే అని కోర్టు పేర్కొంది. కేబినెట్ కి సైతం అధికారులు తప్పుడు లెక్కలు ఇచ్చారని అభిప్రాయపడింది. తొలిసారి ఆర్టీసీ సమ్మె విచారణ సందర్భంగా కేంద్రం తరపు ప్రతినిధులు కూడా విచారణకు హాజరయ్యారు. టీఎస్ఆర్టీసీకి చట్టబద్ధత లేదన్న కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఏపీ ఎస్ ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని తెలిపారు. కేంద్రానికి 33 శాతం వాటా ఏపీఎస్ఆర్టీసీలో ఉంది... టీఎస్ ఆర్టీసీకి ఆటోమేటిక్ గా బదిలీ కాదని కేంద్ర ప్రభుత్వం వాదించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వర రావు.

Next Story
Share it