Telugu Gateway
Andhra Pradesh

అవినీతిపై ఫిర్యాదులకు కాల్ సెంటర్

అవినీతిపై ఫిర్యాదులకు కాల్ సెంటర్
X

ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి నిరోధానికి కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సేవలు అందించేందుకు ఎవరైనా లంచాలు అడిగితే ఈ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ కాల్ సెంటర్ ఏర్పాటుతో ఉద్యోగుల్లో కూడా భయం ఏర్పడి పక్కదారి పట్టరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అవినీతి నిరోధానికి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. టెండర్లలో అవినీతితోపాటు ఏ దశలోనూ అవినీతిని ఉపేక్షించేదిలేదని ప్రకటించారు. అందులో భాగంగానే ఇప్పుడు అనినీతిపై ఫిర్యాదు స్వీకరించేందుకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు.

సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 14400 సిటిజెన్‌ హెల్ప్‌ లైన్‌ కాల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్‌ నేరుగా కాల్‌ సెంటర్‌కి ఫోన్‌ చేసి పనితీరు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే 14400కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. ఎలాంటి ఫిర్యాదునైనా 15 రోజుల నుంచి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఏసీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story
Share it