వాస్తవాలు చెప్పటానికి వస్తే దాడి చేస్తారా?
అమరావతి పర్యటన సందర్భంగా తనపై జరిగిన దాడి పని వైసీపీదే అని తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు వస్తే దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు గురువారం నాడు అమరావతిలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. తాను ఎవరిపై యుద్ధం చేయడానికి రాలేదని అన్నారు. రైతులు త్యాగాలు చేసి రాజధాని నిర్మాణం కోసం 34 వేల ఎకరాలు ఇచ్చారని చెప్పారు. రైతులు త్యాగం చేయకపోతే రాజధాని వచ్చేది కాదన్నారు. రాజధాని 5 కోట్ల ప్రజల భవిష్యత్‌కు సంబంధించినదని, మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఆదాయాన్ని సమకూర్చే నగరం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ రౌడీలను పంపించి దాడులు చేయించారని చంద్రబాబు ఆరోపించారు. తన మీదే దాడులు చేస్తే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. డీఎస్పీ సమక్షంలోనే రాళ్లు, చెప్పులు విసిరారన్నారు.
ఇక్కడ జరిగిన పనులకు, వైసీపీ నేతల మాటలకు పొంతన లేదన్నారు. కొన్ని భవనాలు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు. రాజధానిపై వైసీపీ నేతలు రకరకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పుడున్న రాజధాని కంటే సెంటర్ ప్లేస్ ఎక్కడుందని, చరిత్రలో అమరావతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని అన్నారు. ఏ ప్రాంతానికైనా అమరావతి సమాన దూరంలో ఉంటుందన్నారు. విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటును ఆహ్వానిస్తున్నామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో జగన్ అన్నారని, కనీసం 30 వేల ఎకరాలైనా ఉండాలని జగన్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు 34 వేల ఎకరాలు రైతులు ఇచ్చారన్నారు.
రాజధానిపై వైసీపీ నేతలే కోర్టుకు వెళ్లారని.. రైతులెవరూ వెళ్లలేదని చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం రూ.9,060 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు ఇచ్చిందని, రాజధానికి రూ.55 కోట్లు విరాళాలు వచ్చాయని ఆయన తెలిపారు. అమరావతిపై వైసీపీ నేతలు దుష్ప్రచారాలు చేస్తున్నారని, రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవని చెప్పడం సరికాదన్నారు. అమరావతికి భూమి ఇచ్చిన వారిలో అన్ని కులాలకు చెందినవారు ఉన్నారని, కమ్మ, రెడ్డి, బీసీ, దళితులు భూములు ఇచ్చారని తెలిపారు. ఈ ప్రాంతంపై స్థానికులకు అన్ని హక్కులు ఉంటాయన్నారు. ఒకే సామాజికవర్గం కోసం పని చేస్తున్నానని ప్రచారం చేస్తున్నారని, తనకు సామాజికవర్గం ముఖ్యం కాదని, తెలుగుజాతి ముఖ్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.