Telugu Gateway
Telangana

ఆర్టీసీని విలీనం చేయం..వాళ్ళను ఉద్యోగంలోకి తీసుకోం

ఆర్టీసీని విలీనం చేయం..వాళ్ళను ఉద్యోగంలోకి తీసుకోం
X

ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆర్టీసీపై తీసుకున్న నిర్ణయం. మేం కెసీఆర్ ఇంట్లో నౌకర్లం కాదు..ఎలా అంటే అలా తీసేయటానికి ఇది యూనియన్ నాయకుల మాట. ప్రతిపక్షాలు అన్నీ కార్మిక సంఘాలకు అండగా నిలబడ్డాయి. ప్రభుత్వం మాత్రం ఇక చర్చలు లేవు..చర్చించుకోవటాలు లేవు. మా నిర్ణయమే ఫైనల్ అంటూ తేల్చేసింది. కార్మిక నేతల బ్లాక్ మెయిల్ కు లొంగబోమని..సమ్మె ఏ మాత్రం సమ్మతం కాదని చెబుతోంది. తాజా పరిణామాలను చూస్తుంటే ఆర్టీసిలో రాబోయే రోజుల్లో ‘ప్రైవేట్’ హవా నడవబోతోంది. ఇఫ్పటికే ఉన్న ప్రైవేట్ అద్దె బస్సులకు తోడు భారీ ఎత్తున కొత్త వాటిని కూడా ఆర్టీసిలో చేర్చబోతున్నారు. ఈ లెక్కన ఆర్టీసి క్రమక్రమంగా ప్రైవేట్ వైపు అడుగులు వేస్తున్నట్లు కన్పిస్తోంది. ఆర్టీసి సమ్మె వ్యవహారం ఇప్పటికే కోర్టు కు కూడా వెళ్ళింది. కోర్టు దీనిపై ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచిచూడాల్సిందే. మూడవ రోజు కూడా ఆర్టీసి కార్మికులు ఏ మాత్రం పట్టువీడకుండా సమ్మెలో పాల్గొంటున్నారు. పండగకు తమ తమ ఊర్లకు వెళ్ళేందుకు సిద్ధమైన ప్రజలు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ దోపిడీ భారీ ఎత్తున సాగుతోంది. ఆదివారం సుదీర్ఘంగా ఆర్టీసి సమ్మెపై సమీక్షించిన కెసీఆర్ పలు నిర్ణయాలు ప్రకటించారు.

‘‘సంవత్సరానికి రూ.1200 కోట్ల నష్టం, రూ.ఐదు వేల కోట్ల రుణభారం, క్రమం తప్పకుండా పెరుగుతున్న డీజిల్‌ ధరలతో పడుతున్న భారం.. ఇన్ని ఇబ్బందులతో ఆర్టీసీ ఉంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా చట్టవిరుద్ధంగా సమ్మెకు దిగి దసరా సమయంలో జనాన్ని ఇబ్బంది పెట్టినవారితో ఎలాంటి రాజీకి రాబోం. సగటున ఆర్టీసీ సిబ్బందికి నెలకు రూ.50వేల జీతం వస్తున్నా ఇంకా పెంచమని అడగడంలో అర్థంలేదు. ఈ యూనియన్‌ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు ప్రభుత్వం తల వంచదు. ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లో చేరని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదు. సమ్మె చేస్తున్నవారు పోను ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం పన్నెండొందలలోపు మాత్రమే’ అని స్పష్టం చేశారు.

‘ఆర్టీసీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నం. సంస్థ మనుగడ ఉండటమే కాదు లాభాల్లోకి వెళ్లాలి. ఇందుకు కొన్ని చర్యలు తప్పవు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు. సమ్మె చేస్తున్నవారితో చర్చించం. భవిష్యత్‌లో కూడా సంస్థలో ఎప్పటికీ క్రమశిక్షణ రాహిత్యం, బ్లాక్‌ మెయిలింగ్‌ వ్యవహారం, తలనొప్పి కలిగించే చర్యలు లేకుండా చేయాలని భావిస్తున్నం. గత నలభై సంవత్సరాలుగా ఆర్టీసీ చుట్టూ అల్లుకున్న వ్యవహారం నిరంతర సమస్యగా పరిణమించింది. దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అనేక రంగాల్లో ముందుకు దూసుకుపోతోంది. ఈ తరుణంలో ఆర్టీసీ సమ్మెల్లాంటివి ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసేలా మారాయి. తాజా సమ్మె చట్టవ్యతిరేకం, బాధ్యతారాహిత్యం. మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మణిపూర్‌ రాష్ట్రాల్లో ఆర్టీసీ లేనే లేదు.

బీహార్, ఒడిశా, జమ్మూ, కశ్మీర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో నామమాత్రంగా ఉంది. అలా చూస్తే కర్ణాటక తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా బస్సులు నడుస్తున్నాయి. ప్రభుత్వం ఆర్టీసీని ఇంత మంచిగా చూసుకుంటుంటే వారు సమ్మెకు దిగడం అవసరమా?’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సమతౌల్యం పాటించాలని అభిప్రాయపడ్డారు. ఒకపక్క ప్రైవేటు భాగస్వామ్యం, మరోపక్క ఆర్టీసీ యాజమాన్యం ఉంటే మంచిదని పేర్కొన్నారు. సమ్మె విషయంలో జనం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, సోషల్‌ మీడియాలో వారి స్పందనే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

Next Story
Share it