Telugu Gateway
Telangana

ఏ డిమాండ్ ను వదులుకోం

ఏ డిమాండ్ ను వదులుకోం
X

ఆర్టీసి సమ్మె విషయంలో అవే పట్టుదలలు. సర్కారు ఓ మెట్టు దిగటంలేదు..కార్మిక సంఘాలు అంతే. ఎవరూ రాజీధోరణి చూపించటం లేదు. ప్రభుత్వం ఆర్టీసీ ఈడీలతో కమిటీ వేస్తే అసలు దానికి చట్టబద్దతే లేదని..చర్చలకు పిలిస్తే వెళతామని ఆర్టీసీ జెఏసీ నేత అశ్వత్థామరెడ్డి తెలిపారు. అదే సమయంలో ఆర‍్టీసీ కార్మికులకు సంబంధించి ఏ ఒక్క డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా బుధవారం దిల్‌సుఖ్‌ నగర్‌ బస్టాండ్‌లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి సహా పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘విలీనంపై వెనక్కి తగ్గినట్లు ఎక్కడైనా చెప్పినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. ఆర్టీసీ కార్మికుల 26 డిమాండ్లపై చర్చలకు రావాలి.

కార‍్మికులు, ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. కార్మికులను గందరగోళంలోకి నెట్టొద్దు’ అని అన్నారు. 2004లో టీడీపీ ఓటమికి ఆర్టీసీ సమ్మె కారణమని ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి గుర్తు చేశారు. తాము ప్రతిపాదించిన 26 డిమాండ్లు తమకు ప్రాధాన్యమే అని అన్నారు. ధనిక రాష్ట్రంలో ధనం ఏమైందని, అదే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం ఎలా చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. కార్మికులను, ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికలకు, ఆర్టీసీ సమ్మెకు సంబంధం లేదని, కార్మికుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దని సూచించారు. టీఎంయూ కార్మిక సంఘం జెండా రంగు మార్చాల్సిన అవసరం వచ్చిందన్నారు.

Next Story
Share it