Telugu Gateway
Telangana

ఆర్టీసి చర్చలు మరోసారి విఫలం

ఆర్టీసి చర్చలు మరోసారి విఫలం
X

దసరా ముందు తెలంగాణలో ప్రయాణికులకు కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే రైళ్ళు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు బస్సులు కూడా బంద్ అయితే ఆగమాగమే. ముఖ్యమంత్రి కెసీఆర్ నియమించిన ఉన్నతాధికారుల కమిటీతో జెఏసీ నేతలు జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. పైగా తమను చర్చలకు పిలిచి అధికారులు అవమానించారని నేతలు మండిపడుతున్నారు. గురువారం జరిగిన రెండోదఫా చర్చల్లో కూడా ఎలాంటి ఫలితం తేలలేదు. కార్మికులు సమ్మెకు దిగితే.. సమ్మెను ఎదుర్కొనేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్యాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవ్వడం కార్మిక సంఘాలకు ఆగ్రహం తెప్పించింది. ఈ అంశాన్ని లేవనెత్తుతూ గురువారం చర్చల నుంచి కార్మిక సంఘాలు అర్ధంతరంగా వెళ్లిపోయాయి. సమ్మె వాయిదా వేసుకోవాలని ఆర్టీసీ జేఏసీకి త్రిసభ్య కమిటీ మరోసారి సూచించింది.

పండగ సందర్భంగా ఉండే రాకపోకలు, రద్దీని దృష్టిలో పెట్టుకొని సమ్మె వాయిదా వేసుకోవాలని కోరింది. అయితే, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ అమలుపై స్పష్టత ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ పట్టుబట్టింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇస్తేనే.. తమ నిర్ణయం చెబుతామని జేఏసీ నేతలు తేల్చిచెప్తున్నారు. ఇదిలా ఉంటే కార్మికులు సమ్మె చేస్తే.. ఆ ప్రభావం బస్సుల రాకపోకలు, ప్రయాణికులపై పడకుండా రవాణా అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సోమేశ్‌కుమార్‌ అధికారులకు సూచనలు చేశారు. స్కూల్ బస్సుల డ్రైవర్లలో ఆర్టీసీ బస్సులను నడిపించే యోచనలో సర్కారు ఉంది. దీని కోసం రోజుకు డ్రైవర్‌కు రూ. 1500, కండక్టర్‌కు రూ. వెయ్యి వేతనంగా ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

Next Story
Share it