Telugu Gateway
Telangana

చర్చలు విఫలం..శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసి బస్సుల బంద్

చర్చలు విఫలం..శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసి బస్సుల బంద్
X

ఆర్టీసిలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మె సైరన్ మోగనుంది. ఐఏఎస్ ల కమిటీతో ఆర్టీసి కార్మిక నాయకులు జరిపిన మూడవ దఫా చర్చలు కూడా విఫలం అయ్యాయి. దీంతో సమ్మె అనివార్యం అని తేలిపోయింది. చర్చలు విఫలం కావటంతో శనివారం నుంచి సమ్మె యథాతథంగా కొనసాగనుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. ఎస్మాకు భయపడేది లేదని, ఆర్టీసీని బతికించడానికే తాము సమ్మె చేస్తున్నట్లు పేర్కొంది. ఎస్మా, పీడీ యాక్టులు తమకు కొత్తకాదని, ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందనటం తప్ప ఒక్క డిమాండ్‌కూ హామీ ఇవ్వటం లేదని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఆర్టీసీ జాక్‌ నేత అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసి సమ్మెకు అన్ని సంఘాలు కలిసి రావాలని కోరారు. డిపో మేనేజర్లు కూడా సమ్మెలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీని బతికించడానికే తాము సమ్మె చేస్తున్నామన్నారు. తాము ఎవరి చేతిలో కీలు బొమ‍్మలు కాదని, ప్రస్తుతం సకల జనుల సమ్మెను మించిన సమ్మె అవసరమని అన్నారు. తమ సమ్మె ద్వారా ప్రజలకు కలిసి ఇబ్బందికి చింతిస్తున్నామని తెలిపారు. మరోవైపు సమ్మెల్లో పాల్గొనే వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్‌ చేస్తామని ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఆర్టీసి సమ్మెపై ఎవరూ తగ్గటం లేదు. ప్రభుత్వం సమ్మెను ఎధుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతుంటే..కార్మిక సంఘాలు కూడా ఎస్మా, డిస్మిస్ లకు భయపడబోమని చెబుతున్నారు. దీంతో ఆర్టీసి వ్యవహారం జఠిలంగా మారింది.

ముఖ్యమంత్రి కెసీఆర్ నియమించిన ఐఏఎస్ ల కమిటీ పలు దఫాలు చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. తమ చర్చల వివరాలను సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. అందులోని ముఖ్యంశాలు..‘ఆర్టీసీ జేఏసీతో మూడుసార్లు సమావేశం అయ్యాం. 26అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. సమ్మె వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశాం. పండగ ఉంది సమ్మె వాయిదా వేయాలని కోరాం. ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక ఇస్తాం. వీలినం అవుతుందని లెటర్ ఇవ్వమన్నారు. సమ్మెను ఎదుర్కోడానికి అన్ని ఏర్పాట్లు చేసాము.

కార్మిక, ట్రాన్స్‌ పోర్ట్ శాఖలు సమ్మె నిషేదం అని చెప్పారు. ఉద్యోగులకు విజ్ఞప్తి, ప్రభుత్యం మీ సమస్యలను పరిష్కరిస్తుంది. అన్ని జిల్లాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. మా కమిటీకి సహకరించండి. మరో అధికారి సునీల్ శర్మ మాట్లాడుతూ సమ్మె జరిగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సిద్దంగా ఉన్నాం. 2100 హైర్ బస్ లు సిద్దం చేశాం. స్కూల్లకు సంబందించి ఇరవై వేల బస్ లు ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తాం. దీనిపై కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడాం. ఆర్టీఏ అదికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడద్దని ఏర్పాట్లు చేస్తున్నాం. ఓలా, ఉబర్, మెట్రో వాళ్ళతో మాట్లాము. వారికి ఎక్కువ చార్జ్ చేయొద్దని చెప్పాము. ఇప్పడున్న సమయంలో సమ్మెకు వెల్లడం నిషేదం,

ఎస్మా అమల్లో ఉంది. సస్పెన్షన్ కు గురవుతారు. మీరు పని చేయండి...మీకు సహకరిస్తాము. సస్పెండ్ అయిన వారి స్థానం లో కొత్త వారిని‌ వెంటనే ఉద్యోగంలోకి తీసుకుంటాము. ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో ఆర్టీసికి 1695 కోట్ల సహాయం అందించింది. తెలంగాణ వచ్చాక 3303 కోట్లు ఇచ్చాం. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన దానికంటె రెట్టింపు. బడ్జెట్ లో చెప్పిన దానికంటే డబుల్ ఇచ్చాం. గత రెండేళ్ళ లో మాత్రమే కొంచం తగ్గింది. ఆర్టీసీ ఇప్పుడు సంక్షోభం ఎదుర్కుంటుంది. మాకు సమయం ఇవ్వండి సమస్యను పరిష్కరిస్తాము. ఇలా చేస్తే ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. సంస్థ నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. పని చేయడానికి వచ్చే వారికి రక్షణ కల్పిస్తాము’ అని తెలిపారు.

Next Story
Share it