Telugu Gateway
Telangana

ఆర్టీసిపై తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయాలు!

ఆర్టీసిపై తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయాలు!
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ముందు నుంచీ చెబుతున్నట్లు ఆర్టీసీలో కొత్తగా ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతులు ఇవ్వబోతున్నారా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. సర్కారు కొద్ది రోజుల క్రితం ఈ మేరకు మీడియాకు సష్టమైన సంకేతాలు ఇఛ్చింది. ఆర్టీసీ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు శనివారం నాడు కెసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో పలు నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. శుక్రవారం నాడు సమ్మె అంశం మరోసారి హైకోర్టులో విచారణకు రానుంది. హైకోర్టు విచారణ ఓ వైపు..మరో వైపు కేబినెట్ నిర్ణయాలు. మొత్తం ఆర్టీసి కార్మికుల్లో ఆందోళనను పెంచుతున్నాయనే చెప్పాలి. ఒత్తిడిని తట్టుకోలేక కొంత మంది కార్మికులు గుండెపోటుతో మరణిస్తున్నారు. మరికొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత ఇరవై ఆరు రోజులుగా సమ్మె సాగుతున్నా సర్కారు మాత్రం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో మాత్రం సానుకూల వైఖరి చూపించటం లేదు. కార్మికులు కూడా ఏ మాత్రం రాజీ లేకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం విలేకరుల సమావేశంలో మాట్లాడిన సీఎం కెసీఆర్ ఒక్క సంతకంతో ప్రైవేట్ బస్సులకు అనుమతిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రివర్గ సమావేశంలో ఆ దిశగానే చర్యలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆర్టీసిని ప్రైవేట్ పరం చేయబోమని అంటూనే సంస్థలో 50 శాతం సొంత బస్సులు, 30 శాతం అద్దె బస్సులు, మిగిలిన 20 శాతం ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతులు ఇస్తామని కెసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం చేసిన తాజా చట్టంలోనూ ఇందుకు అవకాశం కల్పించారని స్పష్టం చేశారు. ఇప్పుడు కొత్తగా సుమారు 5 వేల రూట్లలో ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతి ఇచ్చే తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఈ శుక్ర, శనివారాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఇదిలా ఉంటే ప్రజలు మాత్రం ఎప్పుడు ఆర్టీసి సమ్మెకు ముగింపు పడుతుందా?...తమ జర్నీ సాఫీగా సాగుతుందా? అన్న టెన్షన్ తో వేచిచూస్తున్నారు.

Next Story
Share it