Telugu Gateway
Telangana

హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు షాక్

హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు షాక్
X

అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్ నేతల అభ్యర్ధన మేరకు ఆ పార్టీ అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన సీపీఐ పార్టీ ఇప్పుడు తన మద్దతును ఉపసంహరించుకుంది. ఇందుకు ఆర్టీసీ సమ్మె కారణమైంది. అధికార టీఆర్ఎస్ సీపీఐ మద్దతు కోరటమే ఆ పార్టీ బలహీనతను బహిర్గతం చేసింది. ఇది ఒకెత్తు అయితే పెద్దగా బలం లేని సీపీఐ కూడా తాము టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వటంలేదని ప్రకటించటం అధికార పార్టీకి షాక్ లాంటి పరిణామమే అని చెప్పొచ్చు. సోమవారం నాడు అత్యవసరంగా సమావేశం అయిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై విస్తృతంగా చర్చించి టీఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసి కార్మికులు తమ హక్కులు, డిమాండ్లపై గత పది రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

సమ్మె కార్మికుల చట్టబద్ధమైన హక్కు అని..దాన్ని నిరాకరించటం కార్మిక వ్యతిరేక వైఖరే అని పేర్కొంది. కార్మికులతో చర్చించటానికి నిరాకరిస్తూ ఏకంగా 48 వేల మందిని నిర్ధాక్ష్ణంగా తొలగిస్తున్నట్లు ప్రకటించటం ద్వారా కార్మికులను రెచ్చగొట్టారని విమర్శించారు. ఈ వైఖరి మార్చుకోమని సీపీఐ చేసిన వినతిని సర్కారు పెడచెవిన పెట్టిందని..కార్మికుల ఆత్మాహుతి చేసుకునే పరిస్థితి కల్పించారని ఆరోపించారు. సమస్యను పరిష్కరించే బదులు ప్రభుత్వమే విద్వేషపూరితంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. తాజా పరిణామాలతో హుజూర్ నగర్ ఉప ఎన్నిక రాజకీయం మరింత ఆసక్తికరంగా మారినట్లు అయింది. ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Next Story
Share it